మనసుల మధ్య దూరం తగదు;-- యామిజాల జగదీశ్
 ఎవరిమీద మనకు కోపమో వారితో అరుస్తూ గొడవపడతాం. లేదంటే మిట్లాడకుండా ప్రశాంతంగా ఉండిపోతాం. కానీ ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఎవరిమీద మనకు కోపం వచ్చినా వారు మన ఎదుటేగా ఉంటారు. అయినాసరే, ఊరంతటికీ విన్పించేలా అరుస్తాం. నెమ్మదిగా చెప్పవలసింది చెప్తే వారికి వినిపిస్తుంది. ఇలా అన్నానే కానీ నేనూ ఎప్పుడూ ఆలోచిఉచలేదిట్టా. చీటికీమాటికీ కోపం వచ్చే నాకోపానికి మొదట్లో కొన్నిరోజులేమన్నా బాధపడిందేమో కానీ తర్వాత్తర్వాత పట్టించుకోవడం మానేసింది నా భార్యామణి. దాంతో చేసేదిలేక నన్ను నేనే గొణుక్కోవడం చేసేవాడిని. ఆ గొడణుగుడూ ఎలా వినేదో వినేసి ఎందుకొచ్చిన గొడవ ? అనేదేదో అనేసే పైకే అంటుంది తను. అటువంటప్పుడు సిగ్గేసేది. అది అటుంచి
ఓ కథలోకెళ్దాం....
ఓ గురువు గంగలో స్నానమాడి తీరానికొచ్చే వేళ. ఆ సమయంలో ఓ కుటుంబసభ్యులు ఒకరికొకరు పెద్దపెద్దగా తిట్టుకుంటున్నారు. 
ఆ అరుపులను విన్న గురువు తమ శిష్యులవంక చూసి ఓ నవ్వు నవ్వి అడిగారు "ఎందుకు మనుషులు కోపంలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఇలా అరుచుకుంటారు?" అని!
శిష్యులు కాస్సేపు ఆలోచించారు. అనంతరం...
శిష్యులలో ఒకడు "కోపావేశంలో మన ప్రశాంతతను కోల్పోతాం. సహనాన్ని కోల్పోతాం. అందుకే అరుచుకుంటాం" అననాడు.
అంతట గురువు "కానీ నీ ఎదుటే ఉన్న వ్యక్తితో గొంతెత్తి అరవడమెందుకు? ఆ మనిషి ఎక్కడో కంటికి కనిపించనంత దూరంలో లేడుగా? కనుక నువ్వేం చెప్పదలచుకున్నావో అది స్థిరంగా చెప్పొచ్చుగా. వినిపిస్తుంది" అన్నారు.
ఒక్కో శిష్యుడూ ఒక్కో కారణం చెప్పాడు.
కానీ ఏ కారణంతోనూ మరొకరు ఏకీభవించడం లేదు. 
చివరగా గురువు ఇలా చెప్పారు....
ఎప్పుడైతే ఇద్దరు మనుషులు ఒకరిమీద ఒకరికి కోపం వస్తుందో అప్పుడు వారి మనసులు బహుదూరానికి పోతాయి. కనుక దూరాన ఉన్న మనసుకి వినిపించాలని అరుస్తారు. మనసెంత దూరాన జరిగిందో వారు అంతమేరకు తాము చెప్పాలనుకున్న మాటలను అరుస్తూ చెప్తారు. అప్పుడేగా వారి మాటలు అవతలి మనసుకి చేరుతాయి. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు ఏమవుతోంది? వారు ఒకర్నొకరు అరుచుకోరు.ప్రశాంతంగా ప్రేమగా తమ అభిప్రాయాలను చెప్పుకుంటారు. కారణం, వారి మనసులు రెండూ అత్యంత సమీపంలో ఉండటమే. మనసుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. లేదా మనసులు రెండూ పెనవేసుకునే ఉంటాయి.
ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఎక్కువైతే ఏం జరుగుతుంది? వారు పరస్పరం గొంతెత్తి అరుచుకోవలసిన అవసరముండదు. ఇద్దరూ నవ్వుతూ తమ మనసులోని మాటలను ఎంతో అభిమానంతో హృదయపూర్వకంగా పంచుకుంటారు. ప్రేమాభిమానాలు మరింత ఎక్కువైతే మాటలే అవసరమవదు. వారి కళ్ళు మనసులోని మాటలను అర్థం చేసుకుంటాయి. 
ఇలా ఎన్నో మాటలు చెప్పాక గురువు "
మీరు వాదించుకునేటప్పుడు మీ మనసులు దూరం కాకుండా చూసుకోండి. మనసులను దూరం చేసే మాటలను ఉపయోగించకండి.
 అలా చేయకుంటే క్రమంగా మీ మనసుల మధ్య దూరం పెరిగి చివరికి దగ్గరయ్యే అవకాశమే లేకుండా పోయి చూసుకోవడానికి సైతం ఇష్టం లేనంత  దూరమైపోతారు. అది మనసుకి మంచిది కాదు. వీలైనంతవరకూ సదవగాహనతో ప్రేమాభిమానాలతో అన్యోన్యంగా ఉండండి" అని సూచించారు.

కామెంట్‌లు