నైతిక విలువలు; - : సి.హెచ్.ప్రతాప్
 రాజు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. స్వతహాగా మంచి తెలివైన వాడు. కష్టపడి చదివే మనస్తత్వం కూడా వుంది. అందుకే క్లాసులో మంచి మార్కులు సాధిస్తూ మొదటి మూడు స్థానాల్లో ఎప్పుడూ వుంటాడు.

ఆ సంవత్సరం రాజుకు టైఫాయిడ్ జ్వరం రావడం వలన రెండు నెలలు స్కూల్ కి వెళ్ళలేదు. జ్వరం తగ్గాక కూడా విపరీతమైన నీరసం వలన చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. అందుకే చదువులో బాగా వెనకబడ్డాడు. వాళ్ళ నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ తో, క్లాసు టీచర్ తో రాజు చదువు గురించి చర్చించారు.  మీ వాడు  మంచి తెలివైన వాడు మరియు క్లాస్ లో ర్యాంక్ కుడా వస్తుంది. కాబట్టి చదువు విషయమై దిగులు చెందనవసరం లేదని, బాగా ఆరోగ్యవంతుడయ్యాక స్కూలులో స్పెషల్ క్లాసుల ద్వారా సిలబస్ ను కవర్ చేద్దామని వారు భరోసా ఇచ్చారు.

ఇంతలో హాఫ్ ఇయర్లీ పరీక్షలు వచ్చాయి. సిలబస్ పూర్తి చేయనందున పరీక్షలకు వెళ్ళనని రాజు భీష్మించుకు కూర్చున్నాడు. అయితే అనుభవం కోసం పరీక్షలకు కూర్చోమని తండ్రి రాజును బలవంతం చేశాడు.
 
స్కూలుకు వెళ్ళినప్పుడు ఇతర క్లాస్ మేట్స్ రాజును గేలి చేయడం మొదలెట్టారు.క్లాస్ లో ర్యాంక్ హోల్డర్ ఇసారి ఫెయిల్ అవడం ఖాయం అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే రాజు మనస్సు కుత కుతలాడిపోయింది. నడిరోడ్డు మీద నిలబెట్టి రాళ్ళతో కొట్టినట్టుగా బాధపడ్డాడు. ఇంతలో తన కంటే తక్కువ ర్యాంకు తెచ్చుకునే సునీల్, అనీల్ లు ఎదురయ్యారు. ఈసారి పరీక్షలలో మాకే మంచి ర్యాంకులు వస్తాయి. సరా సరి తీసుకుంటే ఫైనల్ పరీక్షల తర్వాత కూడా మాకే మంచి ర్యాంకులు అని భుజాలు చరుచుకున్నారు.

నిస్పృహ ఆవరించగా రాజు పరీక్ష హాలులో కూర్చున్నాడు. క్వశ్చన్ పేపర్లు పంచారు. మూడు నెలలుగా అనారోగ్యం వలన తన చదువు ఆటక ఎక్కిపోయింది. ఒక్క ప్రశ్న కూడ అర్ధం కావడం లేదు. ఎంత బుర్ర చించుకుంటున్నా సమాధానం స్పురించడం లేదు.

లోపల నుండి దుఖం తన్నుకు వచ్చేస్తొంది. కళ్ళముందు కన్నీటి పొరలు దట్టంగా కుమ్ముకో సాగాయి. ఎదుట వున్న పేపర్ కూడా కనిపించడం లేదు.రాజు అవస్థను పక్కనే కూర్చున్న సుధీర్ గమనించాడు. నెమ్మదిగా లో గొంతుకతో, "రాజు, నేను ఈ పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యాను. తొంభై శాతం మార్కులు వస్తాయన్న గ్యారంటీ వుంది. నా పేపర్ నీకు కనిపించేలా పెడతాను. టీచర్ చూడకుండా మొత్తం కాపీ కొట్టేయి" అని అన్నాడు.

ఆ మాటలకు రాజులో కొత్త ఆశ చిగురించింది. సుధీర్ చెప్పినది సబబుగానే వుందనిపించింది.తానెలాగూ కష్టపడి చదువుతాడు. ఈ పరీక్షలకు అనారోగ్యం వలన చదవలేకపోయాడు. ఇప్పుడు తెల్ల పేపర్ ఇచ్చే బదులు  కాపీ కొట్టి పరీక్ష కాస్త గట్టెక్కితే తర్వాత పరీక్షలకు కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించవచ్చు. ఇలా చేస్తే తన ర్యాంకు కూడా నిలబడుతుంది.

యధాలాపంగా రాజు టీచర్ వైపు చూసాడు. ఆయన కుర్చీలో కూర్చోని ఏదో పుస్తకం శ్రద్ధగా చదువుకుంటున్నాడు. ఆయన వాలకం చూస్తే పరీక్ష పూర్తయ్యే వరకు కుర్చీ నుండి లేచేలా లేడని అనిపించింది. వెంటనే సుధీర్ వైపు చూసి కళ్ళతోనే ఓ కె చెప్పాడు.


సుధీర్ కాపీ కొట్టడానికి వీలుగా పేపర్ ని పెట్టాడు. రాజు కాపీ చేసి రాయడం మొదలు పెట్టేంతలో అతగాడికి వాళ్ళ అమ్మ చిన్నతనంలో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
చిన్నప్పుడు ఒకసారి స్కూలులో కాపి చేసి రాస్తున్నాడని వాళ్ళ క్లాస్ టీచర్ ఫిర్యాదు చేసింది. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ  రాజు గూబ గుయ్యనిపించింది.  తర్వాత వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్పింది. " జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిని క్రమశిక్షణతో కష్టపడి పని చేయాలి. సులువుగా విజయం సాధించేందుకు అడ్డదారులు తొక్కడం మంచి పద్ధతి కాదు.  మంచి పనులైనా, చెడ్డ పనులైనా వాటి ఫలితాలు మనమే అనుభవించాల్సి వస్తుంది.అందుకే ఇంకెప్పుడూ జీవితంలో చదువైనా, ఉద్యోగమైనా, ఇంకేదైనా  అడ్డదారిలో సాధించడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. నిజాయితీతో సాధించేదే మన వెంట చివరి దాకా వస్తుంది."

ఆ మాటలు ఒక్కసారిగా రాజు హృదయంలో మార్మోగాయి. తాను చేయబోయేది ఎంతటి తప్పుడు పనో అర్ధం అయ్యింది. ఈసారి పరీక్షలు సరిగ్గా రాయకపోతే కొంపలేం మునగవు కదా. ఈ పరీక్షలతో తన జీవితం ఏమీ అంతం అయిపోదు కదా.వచ్చే పరీక్షలకు ఇంకా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అంతమాత్రాన తప్పుడు దారిలో నడిచి అధర్మంగా మార్కులు తెచ్చుకోవడం ఏం సబబు ?

వెంటనే రాజు తన నిర్ణయం మార్చుకున్నాడు. తనకు తోచిన జవాబులు రాసి గర్వంగా క్లాసు నుండి నడిచి బయటకు వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు ఉగ్గుపాలతో తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పడం ఎంతో అవసరం. అవి వారిని చివరి దాకా తప్పుడు మార్గాన నడవకుండా రక్షిస్తాయి.

కామెంట్‌లు