మన జాతీయ పతాక రూపకర్త...;-చంద్రకళ. దీకొండ,స్కూల్ అసిస్టెంట్,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
 పందొమ్మిదో ఏటనే సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొన్న ఉద్యమ కర్త!
సంస్కృత,ఉర్దూ,జపాన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి "జపాన్ వెంకయ్య"గా పేరు తెచ్చుకున్న మేధావి...
ప్లేగు ఇన్స్పెక్టర్ గా,రైల్వే గార్డుగా వృత్తులు నిర్వహించిన నిరాడంబరుడు!
పత్తి,మైకా,వజ్రాలపై పరిశోధనలెన్నో చేసి ఎనభై రెండేళ్ల వృద్ధాప్యంలో ఖనిజ పరిశోధనా సంస్థకు సేవలందించిన నిరంతర పరిశోధకుడు...
ఏ పదవీ ఆశించని నిస్వార్థ సేవకుడు!
కాషాయం, ఆకుపచ్చ వర్ణాలు మతాలకు ప్రతీకలని ఎంచి
సత్యం అహింసలకు గుర్తుగా తెలుపు రంగును నిలిపిన అహింసావాది!
కార్మిక కర్షకులపై ఆధారపడిన దేశం సత్యాహింసలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన సుమనస్కుడు!
గ్రామజీవనం,రైతు కార్మికత్వాన్ని ప్రతిఫలింపజేస్తూ పతాకం మధ్యలో రాట్నాన్ని చిహ్నంగా నిలిపిన రైతుబంధు!
ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో తన పేరును సూచించకున్నా...
చివరి దశలో ఇడుములెన్నో పడినా...
ఎవ్వరినీ దూషించని
సౌమ్యమూర్తి!
చివరి కోరికగా భౌతికకాయంపై జాతీయజెండాను కప్పమని కోరిన దేశభక్తి పరాయణుడు!
ఎగురుతున్న జెండాలా జనం గుండెల్లో కలకాలం నిలిచి ఉండే పింగళి వెంకయ్య!!!
*************************************


కామెంట్‌లు