శిష్యుల్లో రకాలు -: సి.హెచ్.ప్రతాప్

 ఒక రోజు చావడానికి సిద్ధంగా వున్న మేకను మసీదు కి తీసుకు వచ్చారు.శ్రీ సాయి దానిని చంపమని తన ప్రియ శిష్యుడు బడా బాబాను ఆదేశించగా " దాన్నెందుకు అనవసరం గా చంపడం " అని బడే బాబా తప్పించుకున్నాడు. శ్రీ సాయి తర్వాత శ్యామాను ఆ మేకను చంపమన్నారు. రాధాకృష్ణ మాయి ఇంటి నుండి కత్తి తీసుకుని వచ్చి శ్యామా శ్రీ సాయి ముందు వుంచాడు కాని చంపే ప్రయత్నం చేయలేకపోయాడు. శ్యామా తన ఆజ్ఞలను ఉల్లంఘించడంతో శ్రీ సాయి ఆ పనిని కాకా సాహెబ్ దీక్షిత్ కు పురమాయించారు. కాకా సాహెబ్ దీక్షిత్ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. సదాచార సంపన్నుడు , పుట్టింది మొదలు రక్తం కళ్ళ జూసి ఎరగడు. కానీ శ్రీ సాయి చెప్పిందే తడువు కత్తి ఎత్తి మేకను చంపుతుంటే శ్రీ సాయి దీక్షిత్ తో " ఆగు ! బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మేకను చంపుతావా ?" అని నిరశించారు. అప్పుడు దీక్షిత్ ఈ  తర్కాలన్నీ నాకు తెలియవు. నా సద్గురువు మీరు.మీరు చెప్పిందే వేదం నాకు. మీరే నాకు దైవం మీరు ఆదేశించినప్పుడు నాకు తప్పొప్పులతో సమీక్ష లేదు" అని సవినయం గా విన్నవించుకున్నాడు.
ఇక్కడ శ్రీ సాయి ఒక దివ్యమైన బోధను కళ్ళకు కట్టినట్లు మనకు తెలియజేశారు. శిష్యులలో మూడు రకాలు వుంటారు.
 1. ఉత్తములు - గురువు యొక్క ఆదేశాలు తు చ తప్పక పాటించే వారు
2.మధ్యములు - గురువు ఆదేశాన్ని గూర్చి తమ స్వల్ప బుద్ధితో ఆలోచన చేసి తమకు నచ్చితే చేయడం , లేకుంటే మాని వేయడం
3. అధములు - గురువుల ఆదేశాలు ధిక్కరించే వారు.
 ఎంతో కృషి చేస్తే గాని పొంద లేని జ్ఞానాన్ని మనకు అరటి పండు వొలిచి అందించినట్లు అందించారు మన సాయినాధులు. ఉత్తమ శిష్యునికి గురువు యొక్క అనుగ్రహం సత్వరం లభిస్తుంది. మధ్యమునికి అనుగ్రహ ఫలం లభించేందుకు కొన్ని జన్మలు ఎత్తవలసి వుంటుంది. అధమ శిష్యునికి ఎన్ని జన్మలు ఎత్తినా అనుగ్రహ ఫలం లభించదు.
ఒక ప్రాణిని అనవసరం గా చంపకూడదు అన్న జ్ఞానం శ్రీ సాయికి లేక కాదు ఇంత కధను నడిపించినది. ఈ కలియుగం లో మానవులు తమ స్వల్ప అల్ప బుద్ధిని ఉపయోగించి తర్క, వితర్కాలు, న్యాయ మీమాంస లో పాల్గొంటారు. అదే ఒక తార్కాణం వుంతే కనీసం ఆ బోధ ద్వారా అయినా మం చిని నేర్చుకొని, మంచి బాటలో నడుస్తారని సమర్ధ సద్గురువైన శ్రీ సాయి ఒక సంఘటన ద్వారా మనకు జ్ఞాన బోధ చేసారు.ఆ సాయి చూపిన మంచి బాటలో నడిచి ఎల్లవేళలా మనల్ని సన్మార్గం లో నడిపించమని చిత్తశుద్ధితో ప్రార్థించుదాం. సాయిని మించిన దైవం లేరు,సాయిని మించిన సద్గురువు లేరు, సర్వం సాయి మయం. ఈ జగమంతా సాయి మయం. సాయి సాయి అన్న స్మరణ లో మన జీవితాలలో జ్ఞానాన్ని నింపుకొని ముందుకు సాగుదాం.

కామెంట్‌లు