కోతి సలహా--ఏనుగు గర్వం;-డి.కె.చదువులబాబు

 హరితం అనే అడవికి సింహం రాజు గా ఉండేది.సింహం తన పుట్టినరోజు తనకు నచ్చే కానుక ఇచ్చిన జంతువును సన్మానిస్తా నని వార్తలు తెచ్చే పావురంతో అంది. ఈవిషయం పావురం ద్వారా జంతువులకు, పక్షులకు తెలిసింది. మృగరాజు పుట్టినరోజు కు జంతువులు, పక్షులు కానుకలతో హాజరయ్యాయి.చిలుక జామపండ్లను ఇచ్చింది.సింహం ఒక ముక్క కొరికి వగురుగా ఉన్నాయని పక్కన పెట్టింది. కోతి తాను తెచ్చిన మామిడిపండ్లను మృగరాజు కు ఇచ్చింది. మామిడిపండు రుచి చూసి వాసన నచ్చలేదని పక్కనుంచింది సింహం. తోడేలు సింహానికి ఇష్టమని మాంసం ఇచ్చింది."రోజూ తినేదే కదా"అంటూ పక్కన పెట్టింది.నక్క తాను తెచ్చిన మల్లెపూలదండ ను మృగరాజు మెడలో వేసింది.
పూలవాసనకు తల తిరుగుతున్నట్లుందని దండను తీసేసింది. నెమలి అందమైన తన పింఛాలను ఇస్తే వీటిని ఏం చేసుకోవాలని పక్కన ఉంచింది. ఆవిధంగా ఏ కానుక ఇచ్చినా మృగరాజు కు నచ్చడం లేదు. ఆఅడవిలో ఒక పొగరుబోతు ఏనుగు ఉండేది.అది ఘీంకరించి "సింహ రాజుకు నచ్చే కానుక నా దగ్గరుంది. ఏది ఇవ్వాలో మీ ముఖాలకు ఏమి తెలుసు?" అంటూ చెరుకుగెడలు ఇచ్చింది. 
"మహారాజా!ఒకసారి తిని చూడండి. చెరుకు రసం రుచి చాలా బాగుంటుంది." అంది.
సింహం చెరుకు గెడను కొరకాలని ప్రయత్నించి పండ్లు నొప్పిగా అనిపించడంతో కొరకలేక విసిరేసింది. అంతలో ఒక ఎలుగుబంటి ఆకుదోనెలో తెచ్చిన తేనెను సింహానికి ఇచ్చింది. తియ్యని తేనె రుచికి సింహం మైమరిచి పోయింది.తేనెను పూర్తిగా తాగి,తనివి తీరక
ఆకును కూడా నాక్కుంది. "తేనె రుచి నేను ఎప్పుడూ చూడలేదు. ఈకానుక నాకు బాగా నచ్చింది"అని ఎలుగుబంటి ని ప్రశంసించి ఘనంగా సన్మానించింది. జంతువులు,పక్షులు ఎలుగుబంటి ని అభినందించాయి.పొగరుబోతు ఏనుగు
మాత్రం అసూయతో రగిలిపోయింది. తాను కూడా తేనెను తెచ్చి ఇచ్చి మృగరాజు మెప్పుపొందాలనుకుంది.
మరునాడు తేనెతుట్టె కోసం చెట్లపైకి చూస్తూ వెదకసాగింది. అది గమనించి కోతి,చిలుక,నెమలి,జింక,ఏనుగును పలకరించి"అన్నా!దేనికోసమో వెదుకుతు
న్నట్లున్నావు"అన్నాయి.
 "మృగరాజు తేనెను చాలా ఇష్టపడుతుం దని తెలిసిపోయింది కదా! అదేంగొప్పపనా?నేనూ తేనెను సంపాదించి సింహానికి ఇస్తాను. తేనెతుట్టె కోసం వెదుకుతున్నాను" అంది.
కోతి కిచ కిచ నవ్వి "ఎవరు చేసే పని వారే చేయాలి.తేనెటీగలకాట్లు నువ్వు ఎప్పుడూ రుచి చూసినట్లు లేవు. ఎలుగుబంటికి ఒళ్లంతా వెంట్రుకలున్నాయి. తేనెను ఎలా సంపాదించాలో మెలుకువలు దానికి తెలుసు.తేనెను సంపాదించడం మాటలు కాదు.ఆప్రయత్నంమానుకో"అంది.
ఏనుగు పొగరుగా తలఎగరేసి
"మీరందరూ అల్పజీవులు. మీరు నాకు సలహాలిచ్చేవాళ్లా?ఈ అడవిలో నా అంత పెద్ద జంతువు లేదు. అల్పప్రాణులైన ఈగలు నన్నేం చేస్తాయి"అంటూవెళ్లిపోయిం ది.  ఒకచోట చెట్టు కొమ్మకు వేలాడుతూ తేనెతుట్టె కనిపించింది. తొండంతో కొమ్మను గట్టిగా ఊపసాగింది. బలమైన ఆకదలికకు తేనెటీగలు గుంపులు గుంపులుగా లేచి ఏనుగుమీద దాడి చేసి కుట్టసాగాయి. వాటి కాట్లకు ఏనుగు విలవిలలాడుతూ పరుగు తీసింది.తేనెటీగలు ఏనుగును వదలలేదు. వెంబడించి కుట్టసాగాయి. ఒకచోట నీటికొలను కనిపిస్తే అందులో మునిగి తప్పించుకుంది.ఈగలు వెళ్లిపోయాక బయటకు వచ్చింది. ఒళ్లంతా మండిపోతా నొప్పిగా ఉంది. "ఎవరు చేసేపని వారే చేయాలి.ఏపని చేయాలన్నా అందులోని కష్టనష్టాలగురించి,పర్యావసానాలగురించి
పట్టించుకోకుండా మంచి సలహాలను స్వీకరించకుండా ముందుకెడితే ఫలితం ఇలాగే ఉంటుంది.అసూయ, పొగరు మంచిదికాదు" అని బాధపడుతూ ఏనుగు, వైద్యం చేసే కోతి వద్దకు బయలుదేరింది.

కామెంట్‌లు