మనకీర్తి శిఖరాలు .;-కుప్పాంబిక . ; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 తొలి తెలుగు రామాయణ కర్త అయిన గోన బుద్దారెడ్డి కుమార్తె కుప్పాంబిక మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందినది. తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి భూత్పూరు)లో సా.శ.1276లో ఒక శాసనం వేయించింది. ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.
గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక. కుప్పాంబిక చరిత్ర కేవల కల్పనా కథ కాదు. శాసనస్తమయిన ఆధారాలు ఉన్న అస్తిత్వం ఆమెది. బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో అత్యధిక భాగం ద్విపదగా రాసిన మహాకవి. అతని కొడుకులిద్దరూ కూడా (జంట) కవులే. కాచ భూపతి, విట్ఠల రాజు ద్విపదలోనే ఉత్తర రామాయణం రాశారని ఆ కావ్యంలోనే ఉంది. వాళ్ల సోదరి కుప్పాంబిక. ఈమె మల్యాల గుండన మంత్రి భార్యామణి. భూస్వామ్య భావజాలం ప్రభావంలో పుట్టిపెరిగిన పదజాలం ప్రకారం కుప్పాంబిక వీరపుత్రి - వీరపత్ని కూడా. అయితే 1270 దశకంలో గుండయ్య చనిపోయిన తర్వాత, కుప్పాంబికే పాలన పగ్గాలు చేపట్టిందంటారు. అప్పటికామెకి 35-40 సంవత్సరాల వయసుంటుందేమో. అంచేత ఆమెని వీర వనిత అనడం సబబు.
‘నవజాతాంబకు డేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక వనంబ మదికిన్ ధైర్యంబు రానీయ ద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలువ నాహా! సిగ్గుమైకోదు, పా
వన వంశంబు స్వతంత్రమీయదు, చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే’
ఉక్కిరిబిక్కిరి చేసే ‘యవనవ్వనం’ ఎవరినీ క్షమించదు. ‘వాంఛల్ తుదల్ముట్ట’డం కూడా సహజమే. సిగ్గు కూడా ఎవరికీ తప్పని ఓ సహజావస్థ. వీటన్నిటికీ తోడు, ‘పావన వంశంబు’లో పుట్టిన వాళ్లకి - ముఖ్యంగా ఆడపడుచులకి - అదనంగా సంప్రాప్తించే దుర్గతి మరొకటి ఉంది; అదే పారతంత్య్రం.

కామెంట్‌లు