దీపావళి పండుగ వైశిష్ట్యం;--సి.హెచ్.ప్రతాప్
 భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. . నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని , అలాగే  రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా , ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ దీపావళి. ఆరోగ్యాలు , భోగ భాగ్యాలు ,సంతోషాన్ని కోరుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకోవడం ఈ పండుగ యొక్క గొప్పదనం..
పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం.
రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం.
దీపావళి రోజున సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పరిసరాలంత దీప కాంతులతో విరాజిల్లుతుంది. దీపం సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. దీపాలతో పాటు బాణాసంచాలు కూడా కాల్చుతారు. దీపావళి రోజున సాయంకాలం మహాలక్ష్మి దేవికి పూజలు చేయటం జరుగుతుంది.
చెడు నశింపజేయడానికి ధర్మాన్ని స్థాపించటానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీదేవికి నిదర్శనంగా వెలిగించే దీపాలు విరజిమ్మే వెలుగులో ప్రజలు సర్వ శుభాలు పొందుతారు.

కామెంట్‌లు