బాలల్లారా రారండి!(బాలగేయం);-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
బాలల్లారా రారండి
బాలికల్లారా రారండి
ఆటలు ఆడుదాంరండి
పాటలు పాడుదాంరండి

మీ జంతువులం 
మీ పొరుగోళ్ళం
మీ పక్షులం 
మీ నేస్తాలం

కిచకిచలాడే కోతులం
బెకబెకలాడే కప్పలం
మేమేమనే మేకలం
బ్యాబ్యామనే గొర్రెలం

భౌభౌమనే కుక్కలం
ఊళలువేసే నక్కలం
గర్జించే సింహాలం
గాండ్రించే పులులం

అంబాయనే ఆవులం
రంకెలుపెట్టే ఎద్దులం
మ్యావుమ్యావుమనే పిల్లులం
బుసలుకొట్టే పాములం

ఘీంకరించే ఏనుగులం
సకిలించే గుర్రాలం
ఓండ్రపెట్టే గాడిదలం
గుర్రుగుర్రుమనే పందులం

క్వ్యాకుక్వ్యాకు మనే బాతులం
కోకోకోమని అరిచే కోళ్ళం
కుకుకుమనే పావురాళ్ళం
గ్రంటుగ్రంటుమనే దున్నలం

కావుకావుమనే కాకులం
కూకూమనికూచే కోకిలలం
కొక్కొరోక్కోయనే కోడిపుంజులం
కీచుకీచుమనే కీటకాలం

కలసిమెలసి జీవిద్దాం
ఒకరికినొకరు తోడుందాం
పరిసరాలను కాపాడుదాం
పరిశుభ్రతను పాటిద్దాం

పచ్చనిచెట్లు నాటేద్దాం
ప్రాణవాయువును పెంచేద్దాం
భూవాసులను బ్రతికిద్దాం
భూగోళాన్ని రక్షిద్దాం


కామెంట్‌లు