*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 087*
 *ఉత్పలమాల:*
*నీ మహనీయతత్త్వరస | నిర్ణయబోధ కథామృతాబ్ధిలో*
*దామును గ్రుంకులాడక వృ | ధా తనుకష్టముజెంది మానవుం*
*డీ మహిలోని తీర్ధముల | నెల్ల మునింగిన దుర్వికార హృ*
*త్తామస పంకముల్ విడునే | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
నీ ఉత్తమమైన తత్త్వమును బోధించే కథలు అనే నదిలో మునుక వేయకుండా, శరీరాన్ని కష్ట పెడుతూ, దేశములో వున్న అన్ని పుణ్య నదులలో స్నానము చేసినంత మాత్రాన మనసులో నింపుకున్న పాపపు ఆలోచనలు అనే బురద వదలదు కదా!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"తెరతీయగ రాదా! లోనీ తెర తీయగ రాదా", "మనసులోని మర్మములు తెలుసుకో! మాన రక్షకా! మరకతాంగ! నా మనసులోని!" అన్నారు త్యాగరాజు గారు. అంటే, మన మనసులో ఉన్న చెత్తను ఊడ్చి అవతల పారవేయ గల వాడు పరమాత్మడు ఒక్కడే. మనలోపల వున్న చెడును, చెడు ఆలోచనలను తొలగించుకునే వరకు, మనకు ప్రశాంతత దొరకదు. పరమాత్ముని నామస్మరణ మీద మనసు లగ్నం అవదు. ఈ పనికిరాని ఆలోచనలను ఆపగలిగేది ఒక్క నామస్మరణ మాత్రమే. అది త్యాగరాజ, రామదాస మహామహులు చెప్పిన పాట లాగా కానీ, లేక ఒక చాగంటి వారు, ఒక గరికపాటి వారు చెప్పిన మాట కానీ. ఏదైనా, మనం మనసు పెట్టి ప్రయత్నం చేస్తేనే మన మనసు ప్రక్షాళన సాధ్యమవుతుంది. ఆవిధంగా, మన మనసును భక్తి అనే నదివైపు మార్చుకోగల శక్తిని పరమాత్ముడు మనకు కలిగించాలని ఆ పరబ్రహ్మ పరమాత్మను ప్రార్థిస్తూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు