*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 092*
 *చంపకమాల:*
*దొరసిన కాయముఁల్ముదిమి | తోచినఁజూచి ప్రభుత్వముల్సిరు*
*ల్మెరపులుగాఁగ ఁజూచి మరి | మేదినిలోఁదమతోడి వారు ముం*
*దరుగుటజూచి చూచి తెగు | నాయు వెరుంగక మోహపాశము*
*ల్దరుగనివారి కేమి గతి | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
శరీర పటుత్వం తగ్గి, ముసలితనము వచ్చినప్పుడు కూడా రాజ్యం, ప్రభుత్వం, సంపదలు అన్నీ మెరపు తీగలు అని తెలుసుకొనక, తమకంటే ముందు ఈ భూమి మీద పుట్టిన వారు, తమ ముందే మరణించుట చూచి కూడా ప్రాణములు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియక పోయినా, ఈ భూమి పైన దొరికే సుఖాల వెంట పరుగెత్తే వారిని గురించి, వారికి పట్టే గతి గురించి ఏమి చెప్పగలము!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*జీవితం చివరి క్షణాలకు చేరుకున్నాక, ప్రాణవాయువు అనంతవాయువులలో కలవడం ఇప్పుడా ఇంకొంచెం సేపట్లోనా అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ ప్రాపంచిక సుఖాల మీదే మనసు, ఆలోచనలు ఉంచుకోవడం మనిషికి ఏమాత్రమూ మంచి చేయదు. నిజానికి ఒంట్లో, మన ఆలోచనలలో కాస్త శక్తి మిగిలి ఉన్నప్పుడే మన ఆలోచనలను నామస్మరణ వైపు ప్రయత్న పూర్వకంగా మరలించే పని చేయమని చెపుతారు, పెద్దలు. కానీ, మనం మన నిత్యకృత్యాలు అనే బండి చక్రం లో చిక్కుకొని, భగవానుని పై మనసు లగ్నం చేయటల్లేదు. ఈ నిత్యకృత్యాలు అనే నదిలో మనం కొట్టుకొని పోకుండా వుండాలి అంటే నామస్మరణ అనే తెడ్డు, పట్టుకొమ్మ సహాయం కావాలి. ఈ సహాయాన్ని మనకు ప్రతీ రోజూ అందించమని, మన ఆలోచనలు, మనసు నిరంతరం పరమాత్ముని ధ్యానం లోనే నిలచి వుండేటట్లు అనుగ్రహించాలని ఆ రామచంద్ర మూర్తినే వేడుకుంటూ.........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు