జగతికి వెన్నెముక స్త్రీ (2);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఎనిమిదో సంవత్సరం వచ్చిన పాపను కన్య అని పిలుస్తారు  ఆలోచనలకు బీజం ఆ వయసు. కుంతీ కథ దీనికి ఉదాహరణగా చెబుతారు. ఆమె సేవలకు ఆనందించిన రుషి వర్యులు ఏదైనా వరం కోరుకోమంటే నా శీలం చెడకుండా నేను అనుకున్న వాడితో  బిడ్డను కనే వరం ఇవ్వమని అడగడం. వ్యాసమహర్షి మనకు చెప్పిన విషయం. ఆ వర ప్రభావం వలన కర్ణుడు లేకపోయినట్లయితే  వ్యాసుల వారి భారతమే లేదు అంటే ఆడపిల్ల తలచుకుంటే దేశాలు నిర్మించడమే కాదు నాశనం కూడా చేయగలదు. తనకున్న శక్తియుక్తులను ఉపయోగించి  తన తంత్ర బలంతో దేశాలను పరిపాలించిన వారి చరిత్ర గమనించినట్లయితే రెడ్డి జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన  నాయకురాలు నాగమ్మ జ్ఞప్తికి వచ్చి తీరుతుంది. ఆమె ఆలోచనా ధోరణి కానీ  పరిపాలనా దక్షత కాని  శత్రువులతో పోరాడే తీరును గానీ ఎవరూ వంక పెట్టి నపాపాన పోలేదు. అలాంటి నాయకురాలు. అసలు స్త్రీ అంటే అర్థం ఎంతమందికి తెలుసు  స్త్రీ అంటే ఆడది  సంతానోత్పత్తికి ఉపయోగపడే యంత్రం  ఇంటి పనులు చేస్తూ సంసారాన్ని గుట్టుగా చేసుకునే  పని మనిషి అని ఆలోచిస్తారు తప్ప  స.ర.త.ఈ  ఈ  నాలుగు అక్షరాల కలయిక అనే విషయం ఏ ఒక్కరూ గమనించారు.  స అంటే సాత్వికం, ర అంటే రాజసం,  త అంటే తామసం,  ఈ అంటే ఏడుపు అన్న భావం మనకు రాదు. ఈ అంటే ఏడుపు అని అర్థం అంటే  కన్నీళ్లు పెట్టుకుని భోరున ఏడవడం కాదు ప్రయత్నం అని అర్థం. త్రి గుణాత్మకమైన లక్షణాలను కలిగిన శరీరాన్ని ఈ భూమి మీదకు పంపే ప్రయత్నం  చేస్తోంది కనుక ఆమెను స్త్రీ అని పిలుస్తున్నాం. అలంకారాలతో ఉన్నది అన్న అర్థంలో కాదు  అలంకారానికి అర్థం చెప్పగలిగిన స్థితిలో ఉన్నది కనుక స్త్రీ ఆమెకు అంత ఉన్నతమైన  స్థానాన్ని సమాజం ఇచ్చింది దానిని ఆలోచించకుండా  మిగిలినవన్నీ ఆలోచిస్తాము.
దేశంలో పితృస్వామ్య దేశమని మాతృ స్వామి దేశమని  విభజన జరగడానికి కారణం  ఈ తర తమ భేదాల తగాదా.  కేరళ త్రిపుర లాంటి రాష్ట్రాలలో స్త్రీ వశీకరణ పొంది రాష్ట్ర పరిపాలన కానీ కుటుంబ పరిపాలన కాని స్త్రీ చేతుల్లోనే ఉంటుంది అన్న విషయం మనకి తెలియాలి  ఆమెకు ఏదైనా ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు  చిన్నమ్మలను కానీ పెద్దమ్మను గాని పిలిచి సలహాలు తీసుకుంటుంది తప్ప  పితృస్వామ్య రాజ్యంలో లాగా  బాబాయ్ నీ పెదనాన్నలను పిలిచి వారి సలహాలు తీసుకొని దానిని అమలు పరిచే స్థితి అక్కడ లేదు  మరి ఆ రెండు రాష్ట్రాల పరిపాలన గమనించినట్లయితే మగవారు పరిపాలించే ఏ రాష్ట్రానికైనా  ఆ రాష్ట్రాలు తీసిపోవు. పరిపాలనలో కానీ క్షేమంలో గానీ సంక్షేమంలో కాని వారే ముందంజలో ఉన్నారు కదా. మన సంప్రదాయాలను నిలబెట్టటం కూడా వారి చేతుల్లోనే ఉంది. దానిని గమనించకుండా మనము స్త్రీని తక్కువగా చూడడం  ఆత్మన్యూనతా భావంగా చెబుతారు పెద్దలు.

కామెంట్‌లు