వెండి వెన్నెల్లో తడిసి ముద్దై
మురిపాల తలపుల్లో
మునిగిపోయి మగతనిదురలో
ఉన్న ఏటి నీటి పాయలో
పొంగారు వెలుగుల్లో
బంగారు కాంతులీను
పర్వతపు ప్రతిబింబం
పలుకరించగానే....
నులివెచ్చని స్పర్శకు
కనులుతెరచి....
నిశ్చేష్టగా నిలిచిపోయి
అబ్బురంగా కలయచూస్తే
ఆకసాన అరుణకాంతులు
సంతసాన గిరుల బుగ్గలు
నిమిరి ముచ్చట తీరగ
ముద్దుచేస్తుంటే..
ఆవరించిన పసిడి వెలుగుల
రాకచూసిన నిషా తిమిరాలు
దాచుకొన చోటులేక
ఏటిలోని నీటిలోకి జారుతున్నవి.
ఊటలాగా ఉబుకుతున్న
ఉషాకిరణాల ప్రకాశంతో
ఇలకు దిగిన కుబేరుని
విమానంలా వెలుగుతున్న
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి