సుప్రభాత కవిత ; బృంద
విశ్వ వేదికపై కిరణాల
ఉదయ రాగాలాపనతో
వెలుగులుచిమ్ముతూ 
ప్రభవిస్తున్న భానుబింబం....

కడలి పదమంటిన 
నదీకన్య  ఆనందంలా
సంతసాన కరిగి నీరైన
ధవళాచల శ్రేణులు.

వరద అభయ హస్తాలు
ఒకేసారి శిరమున తాకినట్టు
పుత్తడి కిరణాలు సోకి
చిత్తం మొత్తం చిత్తై కరిగెనేమో!

బంగరు వరాల మూట
తనకూ  అందిన చోట
ఆనందాన  అపరంజిలా
అందంగా మెరిసే అవని.

జలతారు జరీ అంచు
పట్టు పుట్టము కట్టబెట్టినట్టు
పీటలపై నవ వధువులా
బిడియంగా నవ్వే పచ్చిక బయలు

భానుడి భూపాలం
శిఖరాల సింధుభైరవి
అవని ఆనంద భైరవి
పచ్చిక బయళ్ళ కల్యాణి

ప్రకృతి మొత్తం  ఆ దైవం
స్వరపరచిన నవరాగమాలికే!!
స్వర్గంలా తోచే ఈ భువి సాంతం సొంతం ఆ వనమాలికే!

అందమైన సృష్టి లో
మరో ఆనందమయమైన
సూర్యోదయానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు