రాకాసి పక్షులు (కథ)--సరికొండ శ్రీనివాసరాజు
 అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజైన సింహం పరిపాలనలో జంతువులన్నీ సమైక్యంగా ఉండేవి. ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవి. అలాంటి ఆ అడవిలోకి ఒక రాకాసి కొంగ ప్రవేశించింది. మృగరాజును మించిన పరిమాణంలో ఉన్న ఆ కొంగను చూసి అడవి జీవులు భయపడసాగాయి. కొంగ వాటికి అభయం ఇస్తూ తనకు తోచిన సహాయం చేసేది.
       ఒకరోజు ఒక నెమలి జబ్బుతో బయటికి వెళ్ళలేదు. అది తెలిసిన కొంగ ఆ నెమలికి వైద్యం చేసి, స్వయంగా ఆహారాన్ని తీసుకొని వచ్చింది. ఆ నెమలి పూర్తిగా కోలుకునే వరకు కొంగ సేవలు చేసింది. మరోసారి ఒక కుందేలును ఒక క్రూర జంతువు తరిమితే తల దాచుకొని, ఆహార సేకరణ కోసం భయంతో బయటికి వెళ్ళలేదు. ఆ కొంగకు ఇది తెలిసి కుందేలుకు సహాయం చేసింది. మరోసారి ఒక పక్షి కొత్తగా తన గుడ్లలోంచి వచ్చిన పిల్లలను చూసి, మురిసిపోతుంది. ఆ కొంగ ఆ పక్షి వద్దకు వచ్చి, "మిత్రమా! నువ్వు కొన్ని రోజుల పాటు నీ పిల్లలకు రక్షణగా ఇక్కడే ఉండు. నేను ఆహారాన్ని తీసుకొని వస్తాను." అంది. ఇలా ఆ రాకాసి కొంగ అడవి జీవులు అన్నింటికీ సేవ చేస్తూ అన్నింటికీ కన్నతల్లిని మించిన దైవం లాగా అయింది.
       ఒకరోజు ఒక నక్క కొంగ వద్దకు మూలుగుతూ వచ్చింది. "బకరాజమా! నాకు ఈరోజు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది. కాబట్టి ఒక పదిహేను రోజుల పాటు మాకు ఆహారాన్ని సేకరించి తెస్తావా?" అని వేడుకుంది. కొంగ నక్క ఆరోగ్యాన్ని పరీక్షించి, "సోమరితనం పనికి రాదు. ఆపదలో ఉన్న జీవులకు నేను సహాయం చేస్తా అని తెలిసి, సుఖంగా తిని కూర్చోవాలని ఇలా వచ్చావా? కష్టపడి జీవించడం మన అడవి జీవుల లక్షణం. వెళ్ళు." అంది కొంగ. నక్క కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. 
       ఆ నక్క పక్కనున్న అడవికి వెళ్ళి, అక్కడ ఒక క్రూర జంతువు అయిన పెద్దపులితో సహవాసం చేసింది. "మా అడవిలో ఒక రాకాసి కొంగ ఉంది. దాన్ని ఎలాగైనా చంపి తింటే నీకు కమ్మనైన విందు. నాకూ కొంత మాంసాన్ని ఇవ్వాలి. సరేనా?" అంది. పులి ఆ అడవిలోకి ప్రవేశించి, కొంగ జాడ కనిపెట్టి, దానితో పోరాటానికి దిగింది. కొంగ అవలీలగా పులిని చంపింది. దాని బలానికి అడవిలోని జంతువులు ఆశ్చర్యపోయాయి. 
       గుర్రం, కుందేలు ప్రాణ స్నేహితులు. ప్రతిరోజూ ఒకరిని ఒకరు కలుసుకొని మాట్లాడుకుంటూ చాలా దూరం నడిచి వచ్చేవి. వాటి స్నేహం చాలా జీవులకు ముచ్చట గొలిపేవి. ఒకరోజు కలిసి వెళ్ళిన ఆ రెండు జీవులు జాడ లేకుండా పోయాయి. ఆ అడవి జీవులకు ఒక జింక నిత్యం వైద్యం చేసేది. దాన్ని మించిన వైద్యులు ఎవరూ లేరు. దాని వల్లనే చాలా జీవులకు పునర్జన్మ లభించింది. హఠాత్తుగా ఆ జింక కనబడటం లేదు. ఆ అడవిలోని చాలా జీవులు మాయమవుతున్నాయి. ఇతర జీవులలో ఆందోళన ఎక్కువైంది. నక్క అడవి రాజు వద్దకు వెళ్ళి, "మృగరాజా! ఆ మాయదారి రాకాసి కొంగ ఈ అడవి జీవులను నమ్మించి మోసం చేస్తూ తింటుంది. ఒక పెద్దపులిని నా కళ్ళ ముందే చంపి తినేసింది." అని చెప్పింది. సింహం నమ్మలేదు.
       ఎక్కడ నుంచో ఒక రాకాసి గ్రద్ద వచ్చి అడవిలోని జీవులను తింటుందని, తననూ తరిమిందని, అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని సింహం వద్దకు వచ్చి చెప్పింది ఏనుగు. ఆ తర్వాత ఆ రాకాసి గ్రద్దను తామూ చూశామని, తమ కళ్ళ ముందే ఇంతర జీవులను తీసుకుని వెళ్తుందని, పెద్ద పెద్ద మృగాలను కూడా అవలీలగా తీసుకుని వెళ్ళి తింటుందని చాలా జీవులు చెప్పాయి. కొంగ అత్యవసరంగా అన్ని జీవులతో సమావేశం ఏర్పాటు చేసింది. జీవులన్నీ తమ కష్టాలను చెప్పుకుంటున్నాయి. సమీపంలోనే పొంచి ఉన్న రాకాసి గ్రద్ద ఇదంతా వింటుంది. 
       హఠాత్తుగా ఆ గ్రద్ద అడవి జీవుల మధ్య తిరగసాగింది. జీవులన్నీ గ్రద్దను చూసి పారిపోతున్నాయి. కానీ ఆ గ్రద్ద ఇకపై తన వల్ల ఏ జీవికీ అపకారం ఉండదని తనకూ కొంగలా తోటి ప్రాణులకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని అడగగసాగింది. ఆ జీవులు గ్రద్దను క్రమంగా నమ్ముతున్నాయి. గ్రద్ద అడవి జీవులకు యథాశక్తి సేవలు చేయసాగింది. కొంగతో స్నేహం చేసింది. క్రమంగా కొంగతో గ్రద్ద మరింత సన్నిహితంగా ఉంటుంది. 
       ఒకరోజు గ్రద్ద కొంగతో " ప్రాణ మిత్రమా! ఈ అడవికి సమీపంలో శ్రీగిరి ఉంది. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రేపు సాయంత్రం అక్కడ కలుసుకొని ఆ సుందర దృశ్యాలను చూస్తూ చాలాసేపు గడుపుదాం."అని అన్నది. కొంగ సరేనన్నది. మరునాడు సాయంత్రం గ్రద్ద శ్రీగిరిని చేసేసరికి కొంగ అక్కడే ఉంది. దాని ముందు పాత్రలో ఏదో ఉంది. "మిత్రమా ఏమిటది?" అన్నది గ్రద్ద. "నాకు కొన్నాళ్ళ నుంచి జబ్బు చేసి ఏమీ తినాలని అనిపించడం లేదు. బదరికా వనంలో ఒక ప్రముఖ వైద్యుని వద్దకు వెళితే ఈ ఔషధం ఇచ్చాడు. ఇది తాగితే పది వేల ఏనుగుల బలం వస్తుందట. అన్ని వ్యాధులూ మాయమై భవిష్యత్తులో ఏ వ్యాధులు రాకుండా వేల సంవత్సరాలు బ్రతుక వచ్చట. ఇది తాగితే ఆ తర్వాత ఏ ఆహారం తీసుకున్నా వెయ్యి రెట్లు రుచిగా ఉంటుందట‌ కానీ చాలా చేదుగా ఉంది. అందుకే ఎలా తాగాలా అని ఆలోచిస్తున్నాను. ‌" అన్నది కొంగ. వెంటనే గ్రద్ద ఆ పాత్రను లాక్కొని ఇలా తాగాలి అని తాగింది. క్షణాలలో ప్రాణాలను కోల్పోయింది.
       అక్కడికి చేరిన జంతువులు కొంగను నిందించాయి. అప్పుడు కొంగ ఇలా అంది. "ఓ అమాయక ప్రాణులారా! ఈ గ్రద్ద నా మాంసం మీద ఆశపడి నన్ను నమ్మించడానికి మీకు సేవలు చేస్తూ నాతో స్నేహం చేసింది. ఆ గ్రద్ద వాలకం అనుమానాస్పదంగా ఉంది. నన్ను భక్షించడానికే ఇక్కడికి తీసుకు వచ్చిందని అనుమానం. అందుకే ప్రముఖ వైద్యుని సహాయంతో ఈ విషాన్ని తీసుకు వచ్చాను. ఈ గ్రద్ద ఆశతో నా వద్ద ఈ పాత్రను లాక్కొని విషాన్ని తాగింది. లేకపోతే స్నేహితుని ఎవరైనా వంచన చేసి, వాళ్ళు తాగాల్సిన అమృతాన్ని తాము తాగుతారా? అన్నది కొంగ. అడవి జీవులకు గ్రద్ద స్వభావం అర్థం అయింది. సింహం కొంగను అభినందించింది. అడవికి రాజుగా నియమించింది. ఆ కొంగ పాలనలో అడవి జీవులు మరింత సుఖంగా, స్వేచ్చగా జీవించాయి.

కామెంట్‌లు