కొత్త సంవత్సరం... మొదటి రోజు... ఆదివారం... సాయంత్రం వరకు చాలా ఆనందంగా గడిచింది.అమ్మ మేనమామ పిల్లలు,అమ్మ
చిన్నమ్మ అంటే అమ్మమ్మ తోడబుట్టిన చెల్లెలు, రంగనాయకమ్మ,ఆమె పిల్లలు అందరూ ఒకచోట చేరి
గెట్ టు గాదెర్ ప్రోగ్రాం పెట్టారు.ఆ కార్యక్రమానికి మాకూ ఇన్విటేషన్ వచ్చింది.అంటే మా నలుగురికి మంజు,కాంతి,మాధవి,ప్రమోద్ లకు.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ వైపు బంధువులను నేను చూసింది లేదు.వాళ్ళెవరో కూడా తెలియదు, ఎందుకంటే నేను చాలా చిన్న పిల్లవాడిని.ఈ విషయం
చాలాసార్లు చెప్పాను.మూడు రోజుల క్రితం మా అక్కయ్య మంజులకి మా బాబాయి లక్షినర్సిహ్మారావు
ఫోన్ చేసి,అందరం కలుసుకోవాలని అనుకుంటున్నాం,
మీరు కూడా రావాలి అనీ,చెప్తూ మా అందరి ఫోన్ నెంబర్లను కూడా తీసుకుని,ఫోన్ చేసాడు.ఆదివారం నాకైతే చాలా బద్దకంగా, ఆలస్యంగా,తెలవారుతుంది.
సరే లేచాను...అప్పటికే రెండు ఫోన్ కాల్స్ ఒకటి అక్కయ్య మంజులది, రెండవది బాబాయ్ లక్ష్మి నర్సింహా రావుది.అప్పుడనుకున్నాను, పోవడం తప్పదనీ.. వాళ్ళిద్దరికీ ఫోన్లు చేసి, బ్రెష్ చేసుకోవడం
మొదలుకొని, షేవింగ్, స్నానం.. ఇత్యాది కార్యక్రమాలు
పూర్తి చేసుకుని,మా రమ్య కారులో,మా శ్రీనిధ్ సారథ్యంలో,బోడుప్పల్ కి చేరుకునే సరికి మధ్యాహ్నం రెండున్నర గంటలు అయ్యింది.మంజు, కాంతి, మాధవి, నేను,మాతో పాటు శ్రీనిధి... మేం అయిదురం
అక్కడికి చేరుకునే సరికి బాబాయ్ మమ్ముల్ని బయటి నుంచే రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళాడు.ఒక్క లక్ష్మి నర్సింహా రావు బాబాయ్ తప్ప అక్కడ అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు....
అంత మందిలో ఒక పెద్దావిడ నన్నాకర్షించింది.దాదాపుగా ఎనిమిది పదుల వయసు
తెల్లని చాయ,ముడతలు పడిన శరీరం,ముఖంలో ఏదో తెలియని వర్చస్సు,అనుభవాల తాలూకు గుండె ధైర్యం
చెదరని చిరునవ్వుతో, నాకు కనిపించింది.మా అమ్మమ్మ యశోదమ్మ మనసులో మెదిలింది.దాదాపుగా అమ్మమ్మ పోలికలే ఉన్నాయి,మా అమ్మమ్మకు ఆఖరి చెల్లెలు ఆమే ఆదిమూలం రంగనాయకమ్మ.ఆమె మెట్టినిల్లు
వలిగొండ నుండి మోత్కూరు వెళ్ళే దారిలో పాలడుగు
గ్రామం.భర్త ఆదిమూలం రామారావు.. పట్వారీ,ఆయన పూర్వీకులు పెద్ద భూస్వాములు.వందల ఎకరాల భూమి,ఆ కుటుంబానికి ఉండేది.కాలక్రమేణా ప్రస్తుత తరం వచ్చేసరికి, వాళ్ళకు ఏమీ మిగల్లేదు.తెలంగాణా జిల్లాల్లో అనేక మంది కరణాల పరిస్థితి అదే.తినడానికి తిండి కూడా లేకపోయిన కుటుంబాలు చాలా ఉండేవి.
నేను చెప్పేది, పందొమ్మిది వందల ఎనభై.. తొంబై దశకంలోని పరిస్థితి.పేరుకు మాత్రమే వందల ఎకరాలు
పంట పండించడానికి నీళ్ళు ఉండేవి కావు,అమ్ముదామంటే,కొనెటోడు ఉండేది కాదు.రోజు వారి సరుకుల కోసం,ఎకరాల భూమిని, అమ్మిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి.ముఖ్యంగా రామన్నపేట, వలిగొండ, భువనగిరి, మోత్కూరు, ఆత్మకూరు, బీబీనగర్,మొదలైన మండలాలలో ఒక కరణాల పరిస్థితే కాదు,ఇతరులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు.ప్రస్తుతం పడుతున్నారు.చేసేది లేక పట్టణాలకు వలస వెళ్ళిపోయారు.ఈ మధ్య కాలంలో నేను రోడ్డు షో
అనే ఆర్టికల్ లో రాసాను.నలబై సంవత్సరాలుగా చిట్యాల నుంచి భువనగిరి రోడ్డు ఎంత అధ్వాన్నంగా
ఉందో.. చూస్తే తెలుస్తుంది.అదేమీ కేంద్ర పాలిత ప్రాంతం కాదు,ఆయా ప్రాంతాల్లో ఎంఎల్ఏ, ఎంపీ, సర్పంచులు, వార్డు సభ్యులు,ఎంఎల్సీలు అందరూ ఉన్నారు.కానీ రోడ్డు మాత్రం బాగుపడదు.టాపిక్ దారి తప్పుతున్నట్లుంది.జర్నలిజం వదిలేసి, ముప్పై సంవత్సరాలు అయినా,నాలో జర్నలిస్టు ఆలోచనా విధానం మాత్రం మారలేదు....
మోత్కూరు మండలంలోని వెల్దేవి గ్రామంలో పెండ్యాల సీతారామారావు, పోలీసు పటేల్.
భార్య వెంకటరామనర్సమ్మ... బాధ్యత కలిగిన గృహిణి.సూర్యాపేట దగ్గరలోని బాలెముల గ్రామం ఆమెది.ఆమె పుట్టినింటి పేరు రామరాజు.వీరిద్దరికి మొదటి సంతానం నర్సింహా రావు, ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.వాళ్ళు లక్ష్మి నర్సింహా రావు, రమాదేవి, ఉమాదేవి,సరసీరుహ,మదన్ మోహన్ అయితే, రెండవ సంతానం మా అమ్మ ప్రమీలమ్మకు అమ్మ, మాకు అమ్మమ్మ యశోదమ్మ,రెండవ సంతానం.ఆమె భర్త నెల్లుట్ల వెంకటరామనర్సింహారావు.. ఊరు స్టేషన్ ఘనపురం దగ్గర కూనూరు.ఆమె పిల్లలు మా అమ్మ ప్రమీలమ్మ...అమ్మ మెట్టినిల్లు నల్గొండ దగ్గర చర్లపల్లి మా నాన్న ఆవంచ సీతారామారావు...పిల్లలు మంజుల, క్రాంతి, మాధవి, ప్రమోద్ లు.అమ్మమ్మకు రెండవ సంతానం అహల్యమ్మ భర్త కోదండరామారావు.... వీళ్ళకు పిల్లలు లేరు.ఆ తరువాత నెల్లుట్ల జగతీరామ్,భార్య విజయలక్ష్మి ఆయన పిల్లలు మాధురి,శరత్ చంద్ర, మయూరి,హరీష్ చంద్ర
యశోదమ్మ తరువాత కమలమ్మ ఆమె అత్తారిల్లు వరంగల్ జిల్లాలోని చేర్యాల,భర్త నర్సింహా రావు.ఇంటి పేరు ఎర్రబెల్లి.ఆవిడ పిల్లలు... గోపాలరావు, సుశీల, వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రావు,
సుధాకర్ రావు, సుగుణమ్మ లు.పెండ్యాల సీతారామారావు గారి కుటుంబంలో ఆ తర్వాత వచ్చేది వెంకటరామారావు ఆయనకు ఒకే ఒక కుమారుడు హరీంద్రనాద్.ఆతరువాత కట్టెకోలు జానకమ్మ ఆమె భర్త కట్టెకోలు లక్ష్మీ నరసింహారావు,ఆయన సూర్యాపేట మండలం కందగట్ల గ్రామ పట్వారీ.ఆమెకు పిల్లలు లేరు.ఈ అమ్మమ్మ నాకు బాగా జ్ఞాపకం ఉంది.ఎందుకంటే మా ఊరు చర్లపల్లి కి ఆమె ఎప్పుడూ వస్తుండేది.జానకమ్మ అమ్మమ్మ తరువాత రుక్కమ్మ అమ్మమ్మ ఆమె నల్గొండ పానగల్లుకు చెందిన అక్కినెపల్లి వెంకట రామారావు భార్య.ఈ అమ్మమ్మకు కూడా పిల్లలు లేరు.ఇక చివరిగా ఆదిమూలం రంగనాయకమ్మ అమ్మమ్మ....భర్త ఆదిమూలం రామారావు,ఈయన పట్వారీ.ఆయనది మోత్కూరు నుంచి వలిగొండకు వెళ్ళే దారిలో పాలడుగు గ్రామం.
ఈ అమ్మమ్మ గురించే వ్యాసం మొదట్లో రాసాను.ఈమెకు పిల్లలు ప్రభ,రాణి, సుజాత, వెంకటేశ్వరరావు, ఉదయశ్రీలు.
అంటే రంగనాయకమ్మ అమ్మమ్మ మా అమ్మమ్మ యశోదమ్మకు స్వయాన చెల్లెలు...అందుకే
అందరు అమ్మమ్మల పోలికలు ఒకేలా ఉన్నాయి.మా యశోదమ్మ అమ్మమ్మ మాతో చాలా రోజులు ఉండడం వల్ల,మా చిన్నప్పుడు మా అందరి బాగోగులు ఆమే చూసుకుంటూ ఉండేది.అందుకే మా అందరికీ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం.నిన్న మేమందరం కలిసినప్పుడు రంగనాయకమ్మ అమ్మమ్మ ఎన్నో పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని చెప్పింది.నిజంగా ఆ వయసు వాళ్ళను చాలా అపురూపంగా చూసుకోవాలి.
ఎందుకంటే,మన పద్దతులు, అలవాట్లు,పాత తరం మనుషులు, వాళ్ళు చేసిన పనులు... ఇవ్వన్నీ చెప్పడానికి,ఆ తరం మనుషులు ఉండాలి.వాళ్ళను ఒక
మ్యానుమెంట్ లా చూసుకోవాలి.ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే,ఒక ధైర్యం,ప్రతి పనిలో మంచి చెడులను విశ్లేషించి,మంచి మార్గంలో వెళ్ళేందుకు సలహాలు, సూచనలు ఇస్తూ,సదా మన వెన్నెంటే ఉంటూ, మనకు సమాజంలో,మన బంధు వర్గాలలో గుర్తింపు తెచ్చేలా దోహదపడుతారు.పాపం వాళ్ళేమీ ఆశించరు,చాతనైతే
కోడలికి చేదోడు వాదోడుగా పనుల్లో సహాయ పడుతుంటారు.పెద్దవాళ్ళు క్యాలెండర్ లు చూడరు, అమావాస్య,పున్నమిలు,తిథులు,నక్షత్రాలు నోటితో గుణించి,టక్కున చెప్పేస్తారు.వాళ్ళకు వయసుతో పాటు,జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది...
ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే, నిన్న నేను, మొదటి సారి కలిసిన,మా చిన్న అమ్మమ్మ రంగనాయకమ్మను చూసాకా ఆమె జ్ఞాపకశక్తి,విషయ పరిజ్ఞానం చాలా గొప్పదనీ,గమనించాను.ఆమెలో ఏదో
ఒక శక్తి ఉంది.ఆ శక్తి ఆమె వయసున్న అందరిలోనూ
ఉంటుందనీ నా నమ్మకం.అప్పుడనిపించింది,ఆ తరం
చాలా గొప్పదనీ,వాళ్ళను జాగ్రత్తగా, చాలా సున్నితంగా
చూసుకోవానీ, వాళ్ళు చిన్న పిల్లలతో సమానమనీ....💐💐🙏🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి