విద్యాభ్యాసం స్వదేశంలో
ఆర్థిక సముపార్జనం విదేశంలో
ఇది నేటి యువత అంతరంగం...!!
విషయ పరిజ్ఞానాన్ని
పెంచుకోవడం,
ఆర్థికంగా స్థిరపడటం,
విలాసవంతంగా బతకడం,
ఆశల సౌధాలు
నిర్మించటం కోసం
విదేశీ పయనం
నేటి తరానికి పరిపాటిగా మారింది..!!
విదేశీ వ్యామోహంతో
చిన్ననాటి నుండి
విదేశీ చదువులే లక్ష్యంగా...
పిల్లలను తయారు చేస్తున్న
తల్లిదండ్రులూ లేకపోలేదు...!!
విలాసాల మోజులో పడి
పుట్టిన ఊరుని,
తల్లిదండ్రులను మరిచి
తడి ఆరిన మెరుపు కలలను మిగులుస్తున్న
కుమారులకు కొదవేలేదు...!!
ఉద్యోగాల వేటలో
అరబ్ దేశాలకు వెళ్లి
మోసపోతున్న వారు కొందరైతే...
కొలువులకై వెళ్లి
తల్లిదండ్రులు చనిపోతే దహనసంస్కారాలకు కూడా రానీ
సుపుత్రులు వున్నారనేది
కఠిన వాస్తవం...!!
కాల చక్రంలో మనిషి
తల్లిదండ్రులు,
అన్నదమ్ములు
అక్క చెల్లెలు , భార్య బిడ్డలు
బంధుమిత్రులను కలుపుతూ
సంతానం ఇచ్చే ఆలంబనతో
సౌజన్య వాతావరణం
కోరుకుంటుంది వార్ధక్య దశలో...!!
స్వార్థమే తనకు తాను
పెద్దపీట వేసుకొని
దర్జాగా కూర్చున్న
నేటి నవ సమాజంలో...
ఆర్థికంగా స్థిరపడటం కోసం
పరదేశ పయనం
మలుపు కావచ్చు కానీ....
ఆస్తిని విశాలం
చేసుకోవడం కాదు
ఆంతర్యాన్ని
విశాలం చేసుకోవాలనే వివేకం....
యువత ఆలోచనల వేగంలో ఉండాలి...!!
"జీవన పుస్తకాన్ని"
మరొకరికి
స్ఫూర్తిదాయకంగా లిఖించాలి...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి