ఎస్రాకు కృతజ్ఞతలు;-- యామిజాల జగదీశ్
 తమిళ సాహిత్యంలో ప్రముఖ రచయితగా ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న ఎస్. రామకృష్ణన్ (ఎస్రా) తమిళనాడులోని మల్లాన్కినరు అనే పల్లెకు చెందినవారు. అక్షరాలనే నమ్ముకుని రచయితగా కొనసాగుతున్న సాహిత్యంలో ఇప్పటికే అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. సంచారం ;-- యామిజాల జగదీశ్అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఈయన ఎంత బాగా రాస్తారో అంతకన్నా చక్కగా ప్రసంగిస్తారు. 
పుస్తకాలూ రచనలూ ఆయన శ్వాస. 
కేరళలలో ఓ పుస్తక ప్రదర్శనకు ఆయనతో ప్రారంభోత్సవం చేయించిన సంఘటన మరువలేనిది. కేరళలో రచయితకున్న గౌరవం మాటల్లో చెప్పలేనిదన్న ఎస్. రామకృష్ణన్ "దేశాంత్రి" అనే పేరిట ఓ ప్రచురణ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వెలువడే పుస్తకాలన్నీ ఆయన రచనలే. ఇప్పటికే వంద పుస్తకాలను ప్రచురించిన ఈయన తన రచనలమీద వచ్చే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో సద్విమర్శలూ ఉంటాయి. కొందరు కోపోద్రిక్తులై మాటలు రువ్విన ఘటనలూ ఉన్నాయి. ఓమారైతే ఒకడు ఆయనకు ఉత్తరం రాస్తూ "మీ చేతుల్ని నరుకుతా" అని హెచ్చరించాడు. అయితే ఈయన ఆ ఉత్తరం రాసిన వ్యక్తి ఇంటికెళ్ళి తలుపుతట్టారు. ఉత్తరం రాసిన వ్యక్తి ఆయనను చూసి కంగుతిన్నాడు. నేను రాసినంత మాత్రాన ఇలా తిన్నగా ఇంటికే వచ్చేస్తారా అని అడిగాడు. ఇంతలో అతని భార్య వచ్చి ఏం జరగబోతోందోనని కంగారుపడ్డారు. 
అప్పుడీయన "మీ ఆయన నా చేతులు నరుకుతానని ఉత్తరం రాశారు. అందుకే వచ్చాను. మీ ఇంట కాఫీ తాగిన తర్వాతే ఆ పని చేయించుకుంటాను మీ ఆయనతో" అనగానే ఆ ఇంటి ఇల్లాలు కంగుతింది. 
పుస్తకాలు ఆయన ప్రాణం. రోజూ ఏదో ఒకటి చదువుతారు. ఏదీ లేకుంటే ఓ నిఘంటువైనా తిరగేసి కొన్ని మాటలు చదివి కొత్త పదాలు తెలుసుకుంటారు. 
ఓమారు తనకిష్టమైన పుస్తకం కొనడానికి డిల్లీకి వెళ్ళిపోయారు. 
సంచారం అనే నవల నాదస్వరం గురించి రాసినది. అది చదివిన నాదస్వర కళాకారులు తామేమీ ఇచ్చుకోలేమని, కనుక మీ ఇంటికొచ్చి మేము నాదస్వరం వాయించి మా కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పి అట్లాగే చేశారు. నాదస్వర విద్వాంసుడు కారైకురుచ్చి అరుణాచలం భార్య శాలువ కప్పి ఈయనకు సన్మానం చేశారు. ఈ సంఘటన చిరస్మరణీయమంటారు రామకృష్ణన్. అప్పుడామె వయస్సు తొంబైపైనే కావడం గమనార్హం.
ఓమారు ఓచోట ప్రసంగించడానికి ఈయనను పిలిపించుకుని ఏమీ ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆ కార్యక్రమ నిర్వాహకులు వేదిక మీద ఓ కవర్ చేతిలో పెట్టారు. ఆయన బయటకు వచ్చి కవరులో ఏముందోనని చూస్తే ఓ కాగితం మీద "మేమేమీ ఇచ్చుకోలేం" అని రాసారు.
ఇంకొకమారు ఓ ప్రముఖుడు తనంతట తానుగా ఈయనను గుర్తించి ఓ పుస్తకం వేసుకోవడానికి డబ్బులిచ్చారట. 
ఒకమారు ఈయన ఉంటున్న హోటల్ గదికొచ్చి ఇడ్లీలు పెట్టి నమస్కరించారు ఒకామె. కారణం ఈయన రచనలంటే ఆమె కొడుకుకెంతో ఇష్టం. ఆమె అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అంటారు ఎస్రా.
 రాయపేట (చెన్నై)లోని ఓ ప్రెస్ సిబ్బందిని ఈయన తన పుస్తకావిష్కరణ రోజు వేదిక మీదకు పిల్చి ప్రత్యేకించి సత్కరించారు. ఈయనంటే ఆ ప్రెస్ కార్మికులకు ఎంతో గౌరవం. ఈయనిచ్చిన జ్ఞాపికను ఆ ప్రెస్సులో ప్రముఖంగా పెట్టుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి బోలెడున్నాయి. అయినా ఇప్పటికివి చాలు కదూ! నేను రాసుకునే కొన్నింటికి ఈయన రచనలే మూలాధారం. అందుకాయనకు ధన్యవాదాలు.

కామెంట్‌లు