సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-17
ఉత్ఖాత దంష్ట్ర భుజగ న్యాయము
****
ఉత్ఖాతము అనగా సమూలముగా నాశము చేయబడినది లేదా పెల్లగించబడినది అని అర్థం.దంష్ట్ర అనగా కోర లేదా దంతము అని అర్థం. భుజగమ అనగా పాము అని అర్థం.
ఉత్ఖాత దంష్ట్ర భుజగ న్యాయము అంటే కోరలు తొలగించిన లేదా  పెల్లగించబడిన పాము పైకి చూడటానికి భయంకరంగా కనిపిస్తుంది కానీ కరవలేదు.దానినే ఉత్ఖాత దంష్ట్ర భుజగ న్యాయము అంటారు. దీనినే ఉత్ఖాత దంష్ట్రోరగ న్యాయము అని కూడా అంటారు. ఉరగము అంటే పాము అని అర్థం.
 కొందరు వ్యక్తుల్లో తామస గుణం,దుష్టత్వం,కౄర స్వభావం నశించినా  వారికి మొదట్లో వచ్చిన చెడ్డ పేరు అంత తొందరగా తొలగి పోదు. ప్రవర్తించిన తీరు ఎవరూ మరిచిపోరు. వాళ్ళు ఏమీ హాని చేయలేరని తెలిసినా భయం లోలోపల అలాగే వుంటుంది.
కోరలు తీసిన పామైనా పైకి చూడటానికి భయంకరంగానే కనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 అలా చెడు నుండి మంచిగా మారినా ఆయా వ్యక్తులతో అంత ధైర్యంగా చనువుగా ఉండటానికి గానీ, ధైర్యంగా మాట్లాడటానికి గానీ సాహసం చేయలేం.అలాంటి సందర్భంలోనూ... 
అలాగే ఆ  వ్యక్తులను గురించి బాగా దగ్గరగా మసిలిన వారికి వాళ్ళు కోరలు పీకిన పాము లాంటి వారని, వాళ్ళ వల్ల ఎలాంటి హానీ జరగదని తెలిసినప్పుడు ధైర్యంగా వాళ్ళతో ఉండే సందర్భాల్లోనూ  ఈ ఉత్ఖాత దంష్ట్ర భుజగ న్యాయమును ఉదాహరణగా చెప్పవచ్చు.
ఈ విధంగా కోరలు తీసిన పాముకు గానీ వ్యక్తికి గానీ రెండు రకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి. మంచిగా మారినా అర్థం చేసుకోక పోవడం ఒకటైతే తన వల్ల ఏ హానీ జరగదని తెలిసి తేలికగా చూడబడటం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు