మాట తప్పని భార్య;-- యామిజాల జగదీశ్
ఎంతో డబ్బు కూడబెట్టినతను ఓరోజు భార్యతో చెప్పాడు...

"నేను చనిపోతే నా డబ్బుతోసహా నన్ను పాతిపెట్టాలని. నా మరణానంతర జీవితానికి ఆ డబ్బులవసరం" అని!

"సరే" అంది అతని భార్య.

"నువ్వు నాకు ప్రమాణం చెయ్యి" అన్నాడు భర్త.

ఆమె అతనికిష్టమైన ఓ పుస్తకంమీద వొట్టేసి చెప్పింది. ఈ మాటలు జరుగుతున్నప్పుడు అక్కడే ఆమె మిత్రురాలు కూడా ఉంది.

ఉన్నట్టుండి భర్త చనిపోయాడు. పాతిపెడుతున్న సమయంలో ఓ చిన్న కవరుని ఆమె శవపేటికలో పెట్టింది. అనంతరం అంతిమసంస్కార తంతంతా ముగిసింది.

మిత్రురాలు "నీ భర్త చెప్పినట్టు నువ్వు డబ్బునంతా శవపేటికలో పెట్టలేదుగా" అని అయోమయంగా అడీగింది.

"నాకు దేవుడంటే నమ్మకముంది. మాట తప్పను. నేను ఓ చిన్న కవరు శవపేటికలో పెట్టాను. నువ్వు చూడలేదా" అని ప్రశ్నించింది ఆమె.

"కవరు సరే కానీ నీ భర్త చాలా డబ్బు కూడబెట్టాడుగా...ఆ విషయం అడుగుతున్నాను " అంది మిత్రురాలు.

"అవును. అంతా నా పేరిట ఓ బ్యాంక్ ఖాతాలో జమ చేసి భర్త పేరిట ఓ చెక్ రాసి ఆ కవరులో ఉంచి శవపేటికలో పెట్టాను" అంది ఆమె.

ఆ మాటతో మిత్రురాలికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఇక ఆమె నోటంట మరో మాటొస్తే వొట్టు. 


కామెంట్‌లు