బాలకథల చంద్రుడు ;- -- భైతి దుర్గయ్య అధ్యక్షులు అక్షర సేద్యం ఫౌండేషన్


  బాలల ఉజ్వల భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేసేది బాల సాహిత్యం.బాలల కోసం రచనలు చేసేది కొందరైతే,బాలల చేత రచనలు చేయించేది మరికొందరు.కథకులు చంద్రకాంత్ బాలల కోసం కథలు వ్రాయడమే కాకుండా,నిరంతరం బాలల చేత కథలు,కవితలు,గేయాలు వ్రాయిస్తూ ,వారిలోని సృజనను ప్రోత్సాహిస్తున్నారు. వీరు ఇచ్చిన ప్రోత్సాహముతో చాలా మంది పిల్లలు అద్భుతమైన రచనలు చేస్తూ,బహుమతులు కూడా సాధిస్తున్నారు.ఒక వైపు ఉపాధ్యాయునిగా పాఠాలు బోధిస్తూనే మరొకవైపు విద్యార్థులు సాహిత్యం లో రాణించేలా కృషి చేస్తున్న చంద్రకాంత్ అభినందనీయులు.
      ఇప్పటివరకు 100 బాలల కథలు,125 కవితలు,75 పుస్తక సమీక్షలు, 50 సమకాలీన వ్యాసాలు,25 బాలగేయాలు వ్రాసి బాల సాహితీ లోకంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న చంద్రకాంత్, తన పిల్లలకు కూడా ప్రేరణగా నిలిచారు. కుమారుడు రేవంత్ ,కుమార్తె సహస్రలు ఎన్నో కథలు,కవితలు,గేయాలు వ్రాసారు.వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన సందర్భాలున్నాయి.
      గ్రామీణ ప్రాంత నేపథ్యం గల చంద్రకాంత్,తాను వ్రాసిన ఈ కథల్లో పల్లెటూరి సంస్కృతులు,పాఠశాల జీవనం,బాలల ఆశయాలు లాంటి పిల్లలకు ఉపయోగపడే అంశాలకు పెద్దపీట వేసారు.చిన్నారి బాలలను ఎంతగానో అభిమానించే చంద్రకాంత్ తన మొదటి పుస్తకము బాలల కథలు కావడము ప్రశంసనీయము.పలు సాహితి ప్రక్రియల్లో ప్రవేశమున్న మిత్రులు చంద్రకాంత్ మరిన్ని పుస్తకాలతో అబాలగోపాలాన్ని ఆనందింపచేస్తారని ఆశిస్తూ.....

కామెంట్‌లు