మనోవేదన; - సి.హెచ్.ప్రతాప్
 అవంతీ రాజ్యాన్ని మగధ సేనుడు అనే రాజు ఎంతో జనరంజకంగా పాలించేవాడు.అతని పాలనలో రాజ్యంలో ధనం, తిండి గింజలకు ఎలాంటి లోటు వుండేది కాదు. అతని పాలనలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్తుండేవారు.
దురదృష్టవశాత్తు ఒకసారి ఆ రాజ్యంలో తీవ్రంగా కరువు పరిస్థితుకు ఏర్పడ్డాయి. వర్షాలు లేక, పంటలన్నీ ఎండిపోయాయి. తిండి గింజలకు తీవ్రమైన కొరత వచ్చింది. పశుపక్ష్యాదులతో పాటు ప్రజలు కూడా ఆకలితో అలమటించసాగారు. ఆకలిచావులు కూడా సంభవించడం రాజును ఎంతో మనోవేదనకు గురిచేసింది.జీవనాధారం లేక ప్రజలు శిస్తులు కూడా కట్టలేకపోయారు. రాజు తన మంత్రుల సలహాతో పౌరుగు రాజ్యాల నుండి తిండిగింజలు అధిక రుసుము చెల్లించి తెప్పించి ప్రజలకు ఉచితంగా పంచాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచాక తిరిగి అవంతీ రాజ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజ్యం ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది.మామూలు శిస్తులు కట్టడమే గనగమైపోతుంటే ఖజానా లోటును పూడ్చుకోవడం కోసం అధిక పన్నులు వసూలు చెయ్యమన్న మంత్రుల నిర్ణయాన్ని రాజు ఆమోదించలేదు. ఇప్పటికైతే గండం గడిచింది. భవిష్యత్తులో మళ్ళీ క్షామం వస్తే ఎలా అన్న చింత మగధసేనుడిని వేధించసాగింది. గోరు చుట్టుపై రోకలిపోటులా పొరుగు రాజులు ఒక్కటై తమ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎప్పుడైనా దండెత్తి రావచ్చునన్న వేగుల సమాచారం మగధసేనుడిని మరింత మనోవేదనకు గురి చేసింది. దానితో ఆహారం సక్రమంగా  తినకపోవడం, రాత్రిళ్ళూ సరిగ్గా పడుకోకపోవడంతో మగధసేనుడి ఆరోగ్యం క్షీణించసాగింది.క్రమక్రమంగా మంచానికే ఎక్కువ సమయం పరిమితమై పోసాగాడు. ఆయన మనోవేదనను తగ్గించడమెలాగో మంత్రులకు అర్ధం కాలేదు. 
ఒకరోజు రాజప్రసాదానికి ఒక యోగి వచ్చాడు. మహారాజు ఆయనను  సకల రాచ మర్యాదలతో  తీసుకువచ్చి చక్కని ఆతిధ్యం ఇచ్చాడు.అంతేకాక తన పరివారం మొత్తాన్ని ఆ యోగి సేవలో వినియోగించాడు. ఆ ఆతిధ్యానికి సంతోషించిన  యోగి రాజును ఏదైనా సమస్య వుంటే చెప్పుకోమన్నాడు. మగధసేనుడు తన మనోవేదన గురించి చెప్పాడు. అది తన ఆరోగ్యాన్ని ఎలా హరించివేసిందో, తాను ఎక్కువ సమయం మంచంపైనే గడుపుతున్న విషయం కూడా కణ్ణీఈళ్ళ పర్యంతమై చెప్పుకున్నాడు.అందుకు ఆ యోగి, నీకు వున్న అనారోగ్యం సాధారణ ఔషధాలతో తగ్గేది కాదు. అది రోజు రోజుకూ విషమిస్తోంది. ఇది ఇలాగృ కొనసాగితే అది నీ ప్రాణాలకే ముప్పు అని అనగానే రాజు భయభ్రాంతుడై ఆ యోగి కాళ్ళ మీద పడి తన బాధలు ఎలాగ్గైనా తగ్గించమని కోరుకున్నాడు.

చివరకు ఆ యోగి మూడు నెలల పాటు  తాను చెప్పినట్లు చేస్తే ఆ అనారోగ్యం తగ్గించగలనని చెప్పగా అందుకు మగధసేనుడు అంగీకరించాడు. దాని ప్రకారం మగధ సేనుడు మూడు నెలలపాటు ఆ రాజ్యాధికారాన్ని యోగికి అప్పగించి తాను ఒక సాధారణ ఉద్యోగిగా రాజ్య బాధ్యతలు చేపట్టాలి. అయితే రాజుకు వుండే సౌకర్యాలు, రాచ మర్యాదలు ఏవీ ఈ మూడు నెలల కాలం పాటు వుండవు.
అందుకు మగధసేనుడు అంగీకరించి నాటి నుండి ఒక సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వర్తించసాగాడు. చిత్రంగా ఆ రోజు నుండి అతని ఆరోగ్యం లో మంచి మార్పు రాసాగింది. నెలరోజులు తిరగకుండానే పూర్వపు ఆరోగ్యం తిరిగి వచ్చింది. కడుపుకు నిండా తింటూ ఎంతో ప్రశాంతంగా రాత్రిళ్ళు నిద్రపోగలుగుతున్నాడు.

మూడు నెలల తర్వాత ఒకరోజు యోగి మగధసేనుడిని చూడడానికి వచ్చాడు. తనలో వచ్చిన మార్పు గురించి యోగికి వివరించి అదెలా సాధ్యమని అడిగాడు.
"రాజా, అంతకుముందు నువ్వు అన్ని బాధ్యతలు తలకెత్తుకోవడమే కాక అన్ని వున్నవీ, లేనివి అన్నింటినీ తలకు ఎక్కించుకొని ఆరోగ్యం పాడు చేసుకున్నావు.ఎప్పుడైతే ఈ మూడు నెలల కాలంలో  ఒక ఉద్యోగిగా మాత్రమే నీ బాధ్యతలను నిర్వత్రించావో అప్పుడే నీలో వున్న చింతలు అన్నీ దూరం అయ్యాయి. బాధ్యత ను భారంగా ఎప్పుడూ భావించకూడదు. అట్లే ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప చింతన రూపంలో మనసుకు ఎక్కించుకుంటే   చితి మంటల వలె మనల్ని కాల్చేస్తుంది. నీ మనోవేదన తగ్గిపోవడానికి నువ్వు చింతలను మనస్సుకు ఎక్కించుకోకపోవడమే కారణం అని చెప్పాడు ఆ యోగి.
యోగి ఇచ్చిన సలహాలను, సూచనలను చక్కగా పాటిస్తూ మగధ సేనుడు ఆయుఆరోగ్యాలతో కలకాలం జీవించాడు. 

కామెంట్‌లు