సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-32
కాక పిక న్యాయము
********
కాక/ కాకము అంటే కాకి.పిక/ పికము అంటే కోకిల లేదా కోయిల,కోవెల.
కోకిల తన గుడ్లను కాకి గూటిలో పెడుతుంది. కాకి వాటిని కూడా తన గుడ్లతో పాటు పొదిగి పిల్లల్ని చేస్తుంది.
కోకిల పిల్లలు రెక్కలు వచ్చేంత వరకూ కాకి గూటిలో ఉంటూ కాకి పిల్లలతో  కలిసి పెరుగుతాయి. కానీ రెక్కలు రాగానే గూటినుండి వేరుగా వెళ్ళి పోతాయి.కాకి తల్లి ప్రేమను ఎంతగా పంచి వాటిని పెంచినా  కాకి పెంపకానికి గుర్తింపు ఉండదు.దీనినే కాక పిక న్యాయము అంటారు.
దీనినే మరో రకంగా కోకిల కాకుల జంటచే పెంచబడినా కోకిల తన యొక్క సహజ లక్షణాన్ని కోల్పోదు. కోకిల గొంతు కాకికీ రాదు.అందుకే కాకి కాకియే.కోకిల కోకిలయే అంటారు.దీనినే కాకః కాకః  పికః పికః  అంటారు.
మాతృ మూర్తిగా కాకి గుణం ఎంత గొప్పదైనా, వాక్కు అంతకంటే ఎక్కువగా వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.
కాకి వాక్కు అంటే అరుపు లేదా స్వరము వినడానికి కర్ణ కఠోరంగా ఉంటుంది.అందుకే కాకిని దూషించడం,అసహ్యించుకోవడమూ,కోకిల స్వరమునేమో బాగుందని మధుర వాక్కని పొగుడుతూ  కుహూ కుహూ శబ్దాలు, రాగాలను ఆస్వాదిస్తూ,ఆనందించడం  చూస్తుంటాం.ఇది లోక సహజం.
వాక్కు లేదా మాట/ మధురమైన భాషణము బట్టి ఆదరణ, గౌరవం లభిస్తాయని అర్థం చేసుకోవచ్చు.
 అందుకే"కోకిలమ్మ చేసుకున్న పుణ్యంబేమి/ కాకి చేసుకున్న కర్మమేమి/మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు/ లలిత సుగుణ జాల తెలుగు బాల!"  ఓ శతక కర్త అన్నారు. 
కాకి, కోకిల రూపంలో ఒకే విధంగా ఉన్నా స్వర మాధుర్యాన్ని బట్టి గౌరవాభిమానాలు లభిస్తాయి.దీనినే వేమన గారు "ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు/ చూడ చూడ రుచుల జాడ వేరు... వినుర వేమ" అంటారు.
కాక పిక న్యాయము ఈ విధంగా రెండు రకాలైనటువంటి విషయాల్లో  సందర్భోచితంగా వాడబడుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు