రాజు లక్షణాలు; - సి.హెచ్.ప్రతాప్
 సాళ్వ రాజ్యాన్ని పరిపాలిస్తున్న జయంతుడికి అకస్మాతుగా తీవ్ర అనారోగ్యం చెసింది. దేశ, విదేశాల నుండి ఎందరు పేరు మోసిన వైద్యులను తీసుకువచ్చినా  వైద్యం చేయించినా మార్పు రాలేదు. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణించడం వలన ఆయన మంచం పట్టాడు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇక బ్రతకనని అర్ధమైపోయి, తన రాజ్యానికి వారసుడిని నిర్ణయించి పట్టాభిషేకం చేయించడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చాడు. జయంతుడికి ఇద్దరు కవలలు. ఇద్దరు పది ఘడియల వ్యవధిలో పుట్టారు. వారిలో చిన్నవాడు,పెద్దవాడు అని నిర్ణయించడం చాలా కష్టం.కాబట్టి  వారిలో వయస్సు బట్టి కాక గుణ గణాలు, సామర్ధ్యం బట్టి రాజుగా ఎంపిక చేస్తే మంచిదని రాజగురువు ఇచ్చిన సలహా దృష్ట్యా ఒకరోజు ఇద్దరినీ పిలిచాడు.
ముందుగా పెద్దవాడు అజేయుడిని పిలిచి" నాయనా,నిన్ను ఈ రాజ్యానికి రాజుగా నియమిస్తే, రాజ్య పాలన ఎలా చేస్తావు?" అని అడిగాడు.
" మహారాజా, నేను నా అధికారం, పలుకుబడి ,శక్తియుక్తులు ఉపయోగించి రాజ్య పౌరులలో క్రమశిక్షణ తీసుకువస్తాను. రాజాజ్ఞ లేనిదే వారు అడుగైనా ముందుకు వేయలేని విధంగా వారిని అదుపాజ్ఞలలో వుంచుతాను. రాజధిక్కారానికి పాల్పడినవారికి తీవ్రమైన శిక్షలు విధించి వాటిని అమలు చేస్తాను" అన్నాడు అజేయుడు.
అతడిని పంపేసి, చిన్నవాడైన విజేయుడిని అదే ప్రశ్న అడిగాడు జయంతుడు.
" మహారాజా, నేను మన రాజపౌరులందరికీ అత్యంత విధేయుడిగా వుంటాను. వారికి ఏ లొటు, ఏ ప్రమాదం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను.వారికి అహర్నిశలు సేవ చేయడమే నా కర్తవ్యంగా భావిస్తాను.రాజనేవాడు ప్రజలకు అత్యంత ఆప్తుడిగా వుంటూ, వారి క్షేమం కోసమే తన సమయం కేటాయించాలన్నది నా అభిప్రాయం. సింహాసనంపై కూర్చున్నా ప్రజల సేవకు పూర్తి ప్రాధాన్యత ఇస్తాను " అని అత్యంత వినయ విధేయతలతో జవాబు చెప్పాడు విజేయుడు.
అతని జవాబుకు ఎంతో సంతోషించిన జయంతుడు విజయుడిని మహారాజుగా, అజేయుడిని సర్వ సేనాధిపతిగా ఎంపిక చేసాడు. 

కామెంట్‌లు