తెలుగు నాడు పిల్లలం
వెలుగు రేడు మల్లెలం
సూర్యవంశం వారాలం
చంద్ర అంశం పోరలం !
శుభోదయాన్నే లేస్తాం
శుభ్రంగా స్నానం చేస్తాం
దేవునికి పెడతాం దండం
ఉండదులే మాకిక గండం !
మా బడిబాటను పట్టుతాం
మేం బడి గంటను కొట్టుతాం
కోరి ప్రార్థన గీతం చదువుతాం
కీర్తన బాగోతంలో ఎదుగుతాం !
గురువు అంటే మాకెంతో భక్తి
వారి బోధనలో ఉంది ఏదో శక్తి
అని విన్నాం మేం ఈ లోకోక్తి
అందుకే కలిగెను మాకు ఆసక్తి !
మా సంక సంచిని తీసుకొని
మేం భుజం పైనను వేసుకుని
చక్కగా పోతాంలే మా బడికి
చదువులు చెప్పే ఈ గుడికి !
మా బడి తోటలో పని చేస్తాం
వడిగా శ్రమ విలువను గుర్తిస్తాం
పాదులు తీసి వేస్తాం విత్తనం
పాదుషాలా ఇక మాదే పెత్తనం !
రోజురోజు దర్శిస్తాం మేం గుడి
రివాజుగా ధరిస్తాం మా మడి
మేమందరం స్వామిని కొలుస్తాం
అందరం ఒక్కటై ఇక నిలుస్తాం !
కోనేటిలో స్నానం చేస్తాం
కోనేటిరాయున్ని కొలుస్తాం
అఖండ జ్యోతిని వెలిగిస్తాం
ప్రచండ కాంతిని కలిగిస్తాం !
ఇరుగు పొరుగును చేరదీస్తాం
కోరిన సాయం మేమిక చేస్తాం
అంతా సమానమని భావిస్తాం
కలిసి మెలిసి మేమిక జీవిస్తాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి