వినయ విధేయతలు; - సి.హెచ్.ప్రతాప్
 తుఫానులో మహావృక్షాలు వేళ్ళతో సహా పెకలించుకుపోతాయి. కట్టడాలు కూలిపోతాయి. కానీ ఎంత పెద్ద తుఫానైనా ఒక గడ్డిపోచను ఏమీ చేయలేదు. అణకువ యొక్క మహత్వమిదే. ఇతరుల ముందు తల వంచడమనేది అందరూ అనుకున్నట్లు ఒక మానసిక దుర్బలత కానే కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తల వంచగలిగే ఔన్నత్యము మనలో పెంపొందాలి.మనం ఆర్జించే విద్య మనకు అణుకువ, వినయాలను అందివ్వాలి.
కల్యాణగుణాభిరాముడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు కూడా సాటిలేని మేటి వినయసంపన్నుడే.
 బ్రహ్మాది దేవతలు, వసిష్టవిశ్వామిత్రాది మహర్షులు శ్రీరాముడిని దేవదేవుడిగా మహాత్మునిగా పేర్కొన్నా, ఆయన తనను తాను ‘ఆత్మానాం మానుషం మన్యే’ అని మానవునిగానే భావించుకున్నాడు.
 రామభక్తుడైన హనుమంతుడు కూడా తన ప్రభువైన శ్రీరామునిలోని వినయాన్ని పుణికి పుచ్చుకున్నాడు. అందుకే తనను గూర్చి పరిచయం చేసుకునే సందర్భంలో ‘దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః’ అని వినయంగా రామదాసుడను అని చెప్పుకున్నాడు.
 
వినయ విధేయతలు కలిగినవాళ్లు, కపటం లేనివాళ్లు, నిజాయతీతో కూడిన ధర్మాచరణ కలిగినవాళ్లే దైవసమానులని పూజలందుకుంటారు. దైవం చేత గుర్తింపు పొందుతారు. వినయం బానిసత్వ చిహ్నమని, వూడిగం చేసేవాళ్ల లక్షణమని అనుకుంటే అది మన తప్పు. వినయమే విద్యాసంపన్నుల లక్షణం. వినయమే నిజమైన పాండిత్యానికి భూషణం. వినయం లేని ఏ విద్యా ప్రకాశించదు. వినయం వల్లనే సమస్తం మన ఆధీనంలోకి వస్తుంది. ఎంత గొప్ప స్థితికి చేరినా వినయం విడిచిపెట్టనివారే అసలైన గొప్పవారు. గొప్పవాళ్లుగా చాటుకునేవాళ్లు, లేనిపోని గొప్పతనం తెచ్చిపెట్టుకుని సొంత డబ్బా వాయించుకునేవాళ్లు- వినయాన్ని నటిస్తారు. వాళ్లు ఎన్నటికీ శాశ్వతమైన కీర్తిని సంపాదించలేరు. సహజంగా వినయగుణం కలిగినవారు ఎదిగినకొద్దీ ఒదుగుతారు. ఒదిగిన కొద్దీ ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే ఒక కవి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో వుంది అని అంటాడు. వినయ గుణానికి మొక్క పెట్టింది పేరు. 


కామెంట్‌లు