ఉగాదినాడు ఉదయం సూర్యోదయానికి తలంటు స్నానం చేయాలి. క్రొత్త దుస్తులు ధరించాలి. ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు కట్టాలి. గడపలకు పసుపులు పూసి కుంకుమలు బొట్లు పెట్టాలి. వేపపూత పచ్చడి దేవునికి నివేదించి, భక్తితో స్వీకరించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి-పూర్ణిమ వరకు 15 రోజులు పండుగలు పూజలు ఉన్నాయి.
వేపపూత పచ్చడి-ఉగాదినాడు లేకపోతే పచ్చడి తప్పకుండా స్వీకరించాలి."నింబ కుసుమ భక్షణం"అని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇది ఒక ఔషధం! శాస్త్రం ప్రకారం కొత్త చింతపండు మామిడి ముక్కలు వేప పూలు, కొద్దిగా బెల్లం, కొంచెం ఉప్పు కలిపి, కొంచెం మిరియాల పొడి వేసి షడ్రుదులతో ఉగాది పచ్చడి తయారు చేసి ఉదయాన్నే దేవుడికి నివేదన చేసి ఇంటిల్లిపాది ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి.
ఈ వేప పూతను స్వీకరించడం వల్ల నూరేండ్ల ఆయుష్షు, వజ్రంతో సమానమైన దేహం, సర్వ సంపదలు చేకూరి, సంవత్సరమంతా సుఖంగా ఉండాలని పెద్దలు సూచన.
చేదు, తీపి, పులుపు త్రి గుణాలకు సంకేతం. కాలానుగుణంగా వచ్చే త్రిగుణాత్మక కష్ట సుఖాలు అనే ద్వందాలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ కాలానికి ఏది వచ్చిన సంతోషంగానే స్వీకరించి, అనుభవిస్తాం అని శపధం చేయడానికి ఈ పచ్చడిని ఉగాదినాడు స్వీకరించడం!
వేప పువ్వు, బెల్లం, చింతపండు-ఈ మూడిటి మిశ్రమం ఆరోగ్యకరం. వ్యాధికారక క్రిముల్ని, జ్వరాన్ని, ఉదర రోగాలను, గుండెదడను, కడుపులో మంటను, ఉష్ణాన్ని నశింప చేస్తుంది.
ఉగాది నాటి ముఖ్యాంశాల్లో పంచాంగ శ్రవణం చాలా విశిష్టమైనది. తిధి, వారం, నక్షత్రం, యోగం, కారణం-అనే ఐదు అంగాలు కలది కనుక పంచాంగం. ఉగాది నాడు ఆ సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు రూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి.
జీవన ప్రమాణంలో-ఒక సంవత్సర కాలంలో మున్ముందుగా వచ్చే ప్రకృతిలోనే మార్పులను, ఖగోళంలోని మార్పులను గ్రహించి, అందుకు తగిన శాస్త్రం చెప్పిన విధి విధానాలను ఆచరించి, జీవన మార్గాన్ని సుఖతరము, సులభతరము చేసుకొని పురోగమించడానికి ఆరంభంలో ఆరంభంలో పంచాంగ శ్రవణం ఒక ప్రధాన కర్తవ్యం గా చెప్పబడింది.
శోభక్తునామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి.
ఉగాది పండుగ. - ఆచరణ విధానము.;- తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి