శ్రీ రామనామం విశిష్టత : - సి.హెచ్.ప్రతాప్
 ‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయ కమల మందు వెలుగొందుచున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండవలెను అని శాస్త్రాలు ఉటంకిస్తున్నాయి.
కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని ఈ విధంగా ప్రశ్నించింది 'స్వామీ! 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు 'ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!' అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు .
శ్లో       శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
          సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!
ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. 'రామ' అంటే రమిచడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ మన హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ఎవరయితే భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
'రా' అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మన లోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. 'మ' అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు.
రామ అన్న భవబంధములు నశిస్తాయి. రామ అన్న సమస్త సంపదలు కలుగుతాయి. రామ అన్న సర్వార్ధములు సిద్ధిస్తాయి. రామ అన్న బ్రహ్మహత్యాపాతకం లెల్ల తొలగుతాయి. రామ అన్న సకల సంశయములు నివృత్తి అవుతాయి. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రం కంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు అంతే అతిశయోక్తి లేదు.
ఇంటికి పెద్ద కొడుకుగా, కుటుంబ బాధ్యతలకు కట్టుబాట్లకు అత్యంత విలువనిచ్చి, తండ్రి మాట కోసం కఠోర త్యాగాలను తన జీవితంలోకి ఆహ్వానించిన శ్రీరాముడు తర తరాలకు ఆదర్శనీయుడు.ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సత్యశీలత, ధర్మనిరతిని ఆచరించిచూపిన శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకం. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో, సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకొని ఆదర్శవంతమైన కుటుంబ జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీరామనవమి పండుగ ఒక ప్రత్యేక సందర్భం.


కామెంట్‌లు