సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -90
తుల్యాయ వ్యయ న్యాయము
 ******
తుల్యము అంటే సమానము.ఆయము అంటే ఆదాయము.వ్యయము అంటే ఖర్చు,వెచ్చము అనే అర్థాలు ఉన్నాయి.
ఆదాయమును చూసుకుని దానికి తగ్గట్టు ఖర్చు చేయాలనే అర్థంతో ఈ తుల్యాయ వ్యయ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఉన్నంతలోనే సర్దుకోవాలి.శక్తికి మించి గొప్పల కోసం అప్పులు చేస్తే బొక్కబోర్లా పడక తప్పదు".అంటారు పెద్దలు.
దీనికి సంబంధించిన పద్యాన్ని చూద్దామా!
"ఉప్పు లేని కూర హీనంబు రుచులకు/ పప్పులేని తిండి ఫలము లేదు/యప్పులేని వాడె యధిక సంపన్నుడు/ విశ్వధాభిరామ!వినురవేమ!"
అంటే ఉప్పు లేని కూర రుచిగా ఉండదు అలాగే పప్పులేని భోజనము శరీరానికి అంతగా బలాన్ని ఇవ్వదు. కాబట్టి కూరకు రుచి రావాలంటే ఉప్పు, శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే పప్పు  ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.కానీ అప్పు మాత్రం ఉండకుండా చూసుకోవాలి.అందుకే  అప్పు లేని వాడు అధిక సంపన్నుడని వేమన అన్నారు.అప్పు లేక పోతే చీకూ చింతా లేకుండా హాయిగా ఆనందంగా ఉండొచ్చు .
మరి అప్పు చేస్తే ఆ వ్యక్తికే కాకుండా కుటుంబం మొత్తానికి ముప్పు వస్తుంది.
అప్పు తీర్చలేక ఫలానా రైతు లేదా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు తరచూ పత్రికల్లో చదువుతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది కదా!..
నేడు సమాజంలో  చాలా మంది 'తగ్గేదేలే' అన్నట్లు ఏ చిన్న ఫంక్షన్ అయినా వేలు,లక్షలు నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళైతే ఫరవా లేదు కానీ అరకొర సంపాదన ఉన్న వాళ్ళు కూడా గొప్పలకు పోయి  శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు,ఆ తర్వాత అది తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
దీనినే ఆరుద్ర తన కూనలమ్మ పదాలలో..."తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి/ అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మా!" అన్నారు.
కాబట్టి  మనకున్న ఆదాయాన్ని బట్టే వ్యయం చేయడం నేర్చుకుంటే ఈ 'తుల్యాయ వ్యయ న్యాయానికి' సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు