సుప్రభాత కవిత ; - బృంద
ఎదురైన బ్రతుకు చిత్రం
ఎడతెగని ప్రశ్నల పత్రం
అడుగు అడుగుకో పాఠం
అనుక్షణం  అంతులేని పోరాటం

మదిని మెలిదిప్పు మజిలీలు
అడుగున తడిగా మిగిలే మమతలు
ఎదురు చూపు దేనికోసమో!
ఎదురైనది ఎందుకోసమో!

పరీక్షే రాయని ఫలితాలెన్నో!
పాఠాలే తెలియని పరీక్షలెన్నో?
అహంకారపు ఓటములెన్నో?
మమకారపు గెలుపులెన్నో?

అందివచ్చు అద్భుతాలెన్నో!?
చేయిజారు అదృష్టాలెన్నో?
అండగా ఉండే బలాలెన్నో?
దాసోహమనే బలహీనతలెన్నో!?

శిథిలమైన ఆశలెన్నో!
రాలిపోయిన స్వప్నాలెన్నో!
పెదవిపై నటిస్తూ నవ్వులెన్నో!
కళ్ళలో  గూడుకట్టిన వేదనలెన్నో!

అమాయకంగా నమ్మేసే...
ఆవేశంగా దూరమయే బంధాలెన్నో!
ఆప్యాయంగా దరిచేరి
అంతరంగంలో నిలిచే మమతలెన్నో!

ప్రవల్లిక లాటి జీవితానికి
ప్రభాతమొకటే ఆధారం
నేడు చేయిజారినవి
రేపు అందిరాగలవనే ఆశే మూలం.

ఆశల మందారమాలతో
ఆదిత్యునికి స్వాగతమంటూ

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు