సామాజిక బాధ్యత;-:సి.హెచ్.ప్రతాప్


 బాలలకు సహజంగా ఉండే బాలల హక్కులను ఆటంక పరుస్తున్న దే బాల కార్మిక వ్యవస్థ. పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితుల కారణంగా చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని పక్కనపెట్టి తల్లిదండ్రులు వారి కుటుంబ పోషణలో ఆసరా కోసం పిల్లలను నయానా భయానా మెప్పించి బాధాకరమైన పని పరిస్థితులు అని తెలిసి కూడా బలవంతంగా పనులకు పంపుతున్నారు. ఇక్కడ కుటుంబ పేదరికం, యజమానికి చౌకగా కార్మికులు దొరికే అవకాశం, తల్లిదండ్రుల అమాయకత్వం ఈ దుస్థితికి కారణం అవుతున్నాయి. తల్లిదండ్రుల్లో చైతన్యం లేకపోవడం, ప్రభుత్వాలు కూడా పేద కార్మికుల స్థితిగతులను మార్చకపోవడం, పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ చర్యలు ఫలితం ఇవ్వకపోవడం, పేదలు మరింత పేదలుగా మారడం ఈ బాల కార్మిక వ్యవస్థ బలపడడానికి ప్రధాన కారణాలుగా కనబడుతున్నవి.


ప్రపంచం వైజ్ఞానికంగా, ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ముఖ్యంగా నిలుస్తోంది.కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారని, పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని సామాజిక శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలు తీసుకువచ్చినా, ఇంకా పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్‌లు, బిక్షాటన, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పని చేస్తుండదం క్షేత్ర స్థాయిలో బాల కార్మీక నిర్మూలన చట్టం వైఫల్యాన్ని తెలియజేస్తోంది.. చిన్నారుల‌కు సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, పోటీతత్వంతో నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారని పలు అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారన్నది విస్పష్టం. నేటి బాలలే రేపటి పౌరులని..! చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలని. ఇలా ఎన్నో ఆకర్షణీయమైన నినాదాలు ఇచ్చే ప్రభుత్వాలుక్షేత్ర స్థాయిలో బాల కార్మీకుల వ్యవస్థ నిర్మూలనకు మరింత చిత్తశుద్ధితో కృషి చేయడం అత్యావశ్యకం. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోంది.


కామెంట్‌లు