గజల్;- కిలపర్తి దాలినాయుడు
ఎక్కడికక్కడ మార్గదర్శులై
నిలుస్తాయిగద చెట్లు!
కాయోపండో యిస్తామంటూ
పిలుస్తాయి గద చెట్లు!


పచ్చదనానికి నిచ్చెనలౌతూ
ఆకాశాన్ని పిలుస్తూ
పిడికెడు మట్టిని చూపావంటే
మొలుస్తాయిగద చెట్లు!

వసంతరాగం గుండెను పొదిగి
కువకువలాడే వేకువలై
కొమ్మలనిండా కొత్తగూళ్ళతో 
వెలుస్తాయి గద చెట్లు!

వేసవి వరుడ్ని వేడుక చేయగ
చల్లని పులకింపులకై
మల్లెపూలు తలనిండ తురుముకొని 
కొలుస్తాయిగద చెట్లు!

శిశిర తరంగం పైపైకొస్తే
శిరస్సువంచి నిలబడుతూ
కాలం ఒడిలో చివురుసవురులై
గెలుస్తాయి గదా చెట్లు!
----------------------------------------


కామెంట్‌లు