సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -78
తటాక పరివాహ న్యాయము
*****
తటాకము అంటే చెరువు.పరీవాహము అంటే తూము.
చెరువు నీరు తూము నుంచి కొంచెంగా పోయేలా విడువక పోతే గట్టు తెగి నీరంతా బయటకు పోతుంది. వట్టిపోయిన చెరువు అవుతుంది.
నీరు వదిలేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి.అలాగే అప్పుడప్పుడు చెరువులకు గండ్లు పడుతుంటాయి. చిన్న గండి పడ్డప్పుడే దానిని పూడ్చే ప్రయత్నం చేయాలి.లేదంటే  మొత్తం నీరు వృధాగా పోతుంది.
    
ఈ న్యాయం కేవలం చెరువు నీటికి సంబంధించినదే కాదు.మానవ జీవితానికి, ఆర్థిక నిర్వహణా సామర్ధ్యానికి అన్వయించి చూపిన చక్కని ఉదాహరణ.
' దక్షుడు లేని ఇంటికి బదార్థము వేరొక చోట నుండి వే/ లక్షలు వచ్చుచుండిన పలాయనమై చనుగల్లగాదు,ప్ర/త్యక్షము వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే/ యక్షయమైన గండి తెగినట్టి తటాకము లోన భాస్కరా!"
ఇంటి యజమానికి ఆర్థిక సంబంధమైన నిర్వహణా సామర్ధ్యం లేనప్పుడు ఇతరుల నుండి అంటే వేరే చోట్ల నుండి లక్షలు లక్షల డబ్బు వచ్చినా వ్యర్థంగా ఖర్ఛయి పోతుందే కానీ పైసా కూడా మిగలదు.అవసరమైన మంచి పనులకు ఉపయోగపడదు. దీనినే భాస్కర శతక కారుడు ఇలా అంటాడు... ఏ విధంగా అంటే గండి పడిన చెరువులోకి  ఎన్ని వాగులు వంకలు వచ్చి చేరినా ఒక్క చుక్క కూడా నీరు నిలవదు కదా!"
అందుకే కుటుంబం లోని వ్యక్తులు భర్త కానీ,భార్య కానీ. వారి ఆర్థిక నిర్వహణ సామర్ధ్యం, నైపుణ్యాన్ని బట్టే కుటుంబం ఏ లోటూ లేకుండా సజావుగా నడుస్తుంది.
 
ఈ తటాక పరివాహ న్యాయమునకు దగ్గరగా ఉన్న మర్యాద రామన్నను కథను చిన్నప్పుడు మనమంతా చదువుకున్నాం.
ఒక ఊరిలో రెండు గేదెలు ఉన్న రైతు,వంద గేదెలు ఉన్న రైతు పక్క పక్కనే ఉంటారు. రెండు గేదెలున్న రైతు చాలా పొదుపరి. పాలను అమ్మిన డబ్బును జాగ్రత్తగా దాచేవాడు.వంద గేదెలు ఉన్న రైతుకు తనకు చాలా గేదెలు ఉన్నాయనే గర్వంతో వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు చేసే వాడు.
ఓ సారి అతడికి డబ్బు అవసరమై రెండు గేదెల రైతును అడిగితే అప్పుగా ఇచ్చాడు.
 ఆ తర్వాత ఎంత కాలమైనా ఇస్తానని ఊసే లేదు.అడిగితే "నేను ఇవ్వను పో.  తీసుకున్నట్లు నువ్వు నిరూపించలేవు అని దబాయించాడు.
ఆ రెండు గేదెల రైతు మర్యాద రామన్నకు మొర పెట్టుకున్నాడు.మర్యాద రామన్న ఓ పరీక్ష పెట్టాడు.
రెండు బకెట్లలో నీళ్ళు పెట్టించాడు. వచ్చే దారిలో బురద తొక్కి వచ్చి  చెరొక బకెట్ నీళ్ళతో  కాళ్ళు కడుక్కుని రావాలని చెప్పాడు. ఇదేం పరీక్ష అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారందరూ.
ఇద్దరు రైతులు కాళ్ళు కడుక్కొని వచ్చారు.అప్పుడు మర్యాద రామన్న వంద గేదెలు ఉన్న రైతును మందలిస్తూ  వంద గేదెలు ఉండి కూడా అప్పు చేయడం మొదటి తప్పు.అబద్ధం ఆడటం రెండవ తప్పు.తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వమని తీర్మానం చేశాడు.
ఎలా అంటే వంద గేదెల రైతు కాళ్ళు బకెట్ నీళ్ళతో కడిగాడు కానీ కాళ్ళకు అంటిన బురద పోనేలేదు.రెండు గేదెల రైతు రెండు మగ్గులతో కాళ్ళ బురద పోయేలా కడుక్కుని చక్కగా వచ్చాడు.
దీనిని బట్టి అర్థమై పోయి వుంటుంది. వచ్చిన దానిని సమర్థవంతంగా ఉపయోగించుకునే సామర్థ్యం లేకపోతే తటాకంలో నీరులా వృధా అవుతుంది.
ఇదిగో ఇలాంటి న్యాయాలు చదివినప్పుడు అలాంటి కథలు, పద్యాలు గుర్తుకు వస్తూ హితైషిగా హెచ్చరికలు చేస్తుంటాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు