*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 090*
 కందం:
*చపలాత్ముఁడవని లోపల*
*నపాత్ర జనులకును దాన మందించుట హీ*
*నపు గుక్క నోటి లోపల*
*నిపుణత నేయిపోసినట్లుగా నెగడు కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద, బుద్ది స్థిరంగా లేకుండా చంచలమైన ప్రవర్తన కలిగిన వారికి, యోగ్యత లేనివారికి చేసిన దానము నిష్రయోజనంగా ఉండి పోతుంది. ఎలా అంటే, ఒక కుక్క నోటిలో ఎంతో ప్రయతనము చేసి నైపుణ్యం తో కమ్మటి నేయి పోసినంత మాత్రమున, ఆ కుక్కకు నేయి రుచి తెలియదు కదా! ............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"అపాత్రదానం ఎప్పుడూ సరి కాదని" పెద్దల మాట. ఈ అపాత్రత ఎదుటి మనిషి నడవడిక వల్ల, ఒక పనిని పూర్తి చేసే నైపుణ్యం వలన మనం గుర్తించవచ్చు. ఇటువంటి వారికి చేసే, శ్రమదానం, సంపద దానం, మాట సహాయం ఇలా ఏదైనా, ఎటువంటి మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే, మన సహాయాన్ని ఎలా వాడుకోవాలో, ఆ చంచల బుద్ధి కలవానికి తెలియదు. రావణుని పక్కన ఉన్న విభీషణుని సలహాలు లాగా. సభా పర్వం లో విదురుడు, భీష్మ పితామహుడు మొదలైన పెద్దల సలాహాలు యుధిష్టురునకు రుచించ లేదు కదా! అలాగే. అందువల్ల, అవసరమైన వారికి, ఇచ్చిన సలహా సరైన దారిలో, సమయంలో తీసుకో గలిగిన వారికి మాత్రమే సలాహాలు, సహాయం చేసే సద్బుద్ధిని మనకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు