కైలాసాన్నే తలపించే కైలాస్ టేకిడి శివాలయం..; - రాథోడ్ శ్రావణ్
 ప్రకృతి రమణీయతా,దట్టమైన   అరణ్యం సహ్యాద్రి పర్వత శ్రేణులు, ప్రకృతి సోయగాలు,    అందమైన పుష్పాలు, శిఖరంలో విశాలమైన ప్రదేశం  పక్షుల కిలకిల అరుపులు,కళ్ళకు ఆకట్టుకునే అద్భుత అందాల దృశ్యాలు మధ్య కనిపిస్తుంది శ్రీ శిఖర్  కైలాస్ టేకిడి శివాలయ క్షేత్రం. నిత్యం శివ నామాలు ప్రతిధ్వనించే ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని  నిగిని  తాండ గ్రామ పంచాయితీ పరధిలోని  సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రకృతి ఒడిలో పరమ శివుడు కొలువుదీరినారు.  శివ పార్వతి సమేతంగా దర్శన మిచ్చే ఈ స్వామిని తలచుకుని ఏదైనా అనుకున్న కొరికలు తల పెడితే అది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
ఆలయ నిర్మాణం
కైలాస్ టేకిడి అనగా  కైలాస్ అను పేరు గల పర్వతం టేకిడి అంటే శిఖరం అని అర్థం. ఇది శివలింగాకారంలో ఉంది.
ఇచ్చట శివాలయం మహా  శివలింగ దేవాలయాన్ని సంత్   లింబాజీ మహారాజ్ కట్టించాడు.సంత్ రామారావు మహారాజ్ శిష్యులైన లింబాజీ మహారాజ్  పశువుల కాపరిగా తాండ ప్రజల గోవులను మేపుతు ఉండేవారు.  
ఒక రోజు మహారాజ్ కలలో శివుడు ప్రత్యక్షమై భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయిని,మీకు కూడా మంచిజరుగుతాయిని
నేను చెప్పిన‌ చోటుకు వెళ్ళి దీపం అగర్ ఒత్తులు  వెలగించి పూజ నిర్వహించాలని కోరడంతో లింబాజీ మహారాజ్ 2002 సంవత్సరం నుంచి శివుని సేవలో ఉన్నారు. తోలుత  రేకులతో చిన్న గుడిని నిర్మించారు. ఆ తర్వాత భక్తులే  తలకోంత సహాయం చేసి ఆలయ నిర్మాణం పైన దృష్టి సారించి ఈ శివాలయాన్ని నిర్మించారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కైలాస్ టేకిడి శివాలయాన్ని
వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. 
భక్తులు  సమర్పించే ‌బెల్లం, కుంకుడుకాయ, అరటి పండ్లు సిమెంట్ యందు కలిపి ‌ఒక ప్రత్యేక పద్దతిలో ఆలయాన్ని  లింబాజీ మహారాజ్ నిర్మించారు. ఈ ఆధునిక కాలంలో ఇంజనీయర్ల సలహాలు సూచనలు పాటించ కుండా పురాతన పద్దతిలో ఆద్భతమైన‌ నిర్మాణ శైలిలో పదార్థాలు,పళ్ళను ఉపయోగించి ప్రత్యేకంగా నిర్మాణం గావించారు.  ఈ విధంగా  నిర్మించినచో దాదాపు పదకాండు వేల సంవత్సరాలు  చెక్కుచెదరకుండా  ఉంటుందని  మహారాజ్ కు  ఆ పరమ శివుడే  చెప్పారని  భక్తులు అంటారు.
అలయ  శిఖరం ఎత్తు యాభై ఒక ఫీట్లు ఉంది. ఆలయాన్ని ప్రాచిన దేవాలయం రీతిలో నల్ల రాయిని ఉపయోగించి నిర్మించారు.  గర్భాలయంలో భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నాడు.
దేవుని ఆజ్ఞ ప్రకారం శివలింగాన్ని  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే అతి పెద్దనది అయిన నర్మదా నది నుండి ప్రత్యేక పూజలు చేసి  శివలింగాన్ని  తెచ్చి ఇక్కడ ప్రతిష్టించారు.ఆలయంలో మనకు ద్వాదశజ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. కింకారణ్యంలో బృహత్తరమైన, అత్యంత పవిత్రమైన
 ఆలయం అద్బుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని దక్షిణ భారత ఆలయ శైలిలో నిర్మించడం విశేషం. 
 భక్తుల తాకిడి
ప్రతి సోమవారం రోజున కుల మత భేద‌ భావం లేకుండా వివిధ  గ్రామాల నుండి సమీప తాండలు ,సుదుర ప్రాంతాల నుండి రెండు వేల నుండి మూడు వేల పైన భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకుంటారు.మహాశివరాత్రి నాడయితే ఈ క్షేత్రం 'హరహర మహాదేవ...శంభో శంకర' అన్న శివనామస్మరణతో కైలాస్ టేకిడి కైలాసాన్నే తలపిస్తుంది. శివరాత్రి పండుగ రోజున  మరియు  మాఘ మాసంలో  ఇచ్చట  ప్రత్యేక పూజలు నిర్వహించడం‌ వలన  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కాశి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్ తెలంగాణ  మొదలగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శనం కోసం వస్తారు. ఇచ్చట వచ్చిన భక్తులు రాయి మీద రాయి లింగాకారంలో పేర్చితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని‌ భక్తుల విశ్వాసం.చాలా మంది భక్తుల కోరికలు నేరవేరాయి సంతానం కలుగని దంపతులకు సంతానం కలగడం, కండ్లు లేని, సరిగా చూడని భక్తులకు కూడా చక్కగా కన్పించడం ఇది దేవుని మహీమ అని భక్తులు స్వయానా అనడం విశేషం.
ఘనంగా వేడుకలు:-
 2022లో ఆలయ ఇరువై వార్షికోత్సవం డిసెంబర్ ఐదు నుండి తొమ్మిది తేది వరకు మొత్తం ఐదు రోజుల పాటు  ఆలయ వార్షికోత్సవం వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి  మహారాజ్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వచ్చిన భక్తులు భోజనం స్వీకరించి ప్రసాదం తీసుకొని వేళ్తుంటారు. మాఘ  (ఫిబ్రవరి లేదా మార్చి) మాసంలో  వారం రోజులు పాటు నిర్వహించే మహాశివరాత్రి  ఉత్సవాలలో లంబాడీ గిరిజన మహిళల సంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలను తిలకించేందుకు  భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా ఆలయానికి చేరుకుంటారు.
ఆలయానికి వెళ్ళే దారి సమీపంలో ఒక పెద్ద బావి ఉంటుంది. దేవుని దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా కాళ్ళు చేతులు కడిగి ఆలయానికి వేళ్ళుతారు.  ఆలయ ప్రాంగణంలో
భారీ నందీ విగ్రహం ఉంటుంది. భక్తులు నందేశ్వరుని టెంకాయ కోట్టి మొక్కులు తీర్చు కుంటారు.అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే  ఆలయం ఉంటుంది. ఆలయానికి కొద్ది పాటి దూరంలో ఒక అశ్రమం ఉంది. అచ్చట భక్తులు హోమాలూ,అభిషేకాలు,ఇతర పూజలు నిర్వహిస్తారు.
ఎలా చేరుకోవచ్చు:-
ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా  బోథ్ నియోజకవర్గంలోని నిగిని తాండ మరియు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా  కిన్వట్ తాలుకాలోని దహేల్ ధానోరా ఈ రెండు రాష్ట్రాల సరిహాద్దులో ఉంటుంది. నిగిని నుండి 10 కిలో మీటర్లు దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు, ట్రాక్టర్ ట్రాలీ, ఆటోలూ  అందుబాటులో ఉంటాయి.లేదంటే మహరాష్ట్ర శివని దహేల్ ధానోరా మీదుగా కూడా చేరుకోవచ్చు.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా)
రాథోడ్ శ్రావణ్ 
9491467715



కామెంట్‌లు