సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -98
దగ్ధేంధన వహ్ని న్యాయము
******
దగ్ధము అంటే కాల్చబడిన, కాలిన అని అర్థం.ఇంధనము అంటే చిదుగు లేదా వంట చెఱకు,వంటకు ఉపయోగించే కట్టెలు అని అర్థం. వహ్ని అంటే అగ్ని,పాచక శక్తి, ఆకలి అనే అర్థాలు ఉన్నాయి.
వంట కట్టెలు వంట చేయుటకు తోడ్పడి, తాము మాత్రము కాలిపోతాయి.
 సజ్జనులు కూడా వంట కట్టెల వంటి వారే. తమ నష్టమును సైతము లెక్కచేయకుండా ఇతరులకు సాయపడుతారు అనే అర్థంతో ఈ దగ్ధేంధన వహ్ని న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 సజ్జనులు అంటే మంచి మనసున్న వారు.వారి మనసు ఎంత మృదువైనదో ఈ శ్లోకంలో చూద్దాం.
"మృదులం నవనీతమీరితం నవనీతాదపి సజ్జనస్యహృత్/తదిదం ద్రవతి స్వతాపనాత్ పరతాపాద్రవతే సతాం పునః"
అంటే భావం ఏమిటో చూద్దాం.నవనీతం అంటే వెన్న.ఇది చాలా మృదువుగా ఉంటుంది.కానీ నవనీతము కంటే కూడా సజ్జనుల  హృదయము మరింత మృదువైనదనీ ఈ శ్లోకం చెబుతోంది.
 ఎందుకంటే వెన్నను వేడి చేస్తేనే కానీ కరుగదు స్వతాపనాత్  ద్రవతే.కానీ సజ్జన హృదయము పరతాపా ద్రవతే అంటే ఇతరుల తాపాలకు అనగా ఎదుటి వారి బాధలు కష్టాలనే వేడికి కూడా కరిగిపోతుంది అని అర్థం.
మరి వెన్న కరగాలి అంటే వేడి అనే కష్టాన్ని భరించాలి.అప్పుడే తన మృదుత్వం వల్ల కరిగి పోతుంది. 
కానీ సజ్జనుల హృదయ మృదుత్వం ఎంత గొప్పదంటే ఎదుటి వారి కష్టాలను చూసినప్పుడల్లా  మళ్ళీ మళ్ళీ కరిగిపోతూనే వుంటుంది.అలా ఇతరుల మేలు కోసం తాము కరిగిపోతూ జీవితాలను త్యాగం చేసేవారే సజ్జనులు అని అర్థం.
 ఇలాంటి అర్థం వచ్చేలా సజ్జనుల గొప్పతనం గురించి  భాస్కర శతక కర్త  ఏమన్నాడో చూద్దాం.
"ఉరు గుణవంతు డొర్లుదన కొండపకారము సేయునప్పుడున్/బరహితమేయొనర్చు నొక పట్టునైనను గీడు సేయగా/నెఱుగడు నిక్కమేకద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్/దరువగ జొచ్చినం బెరుగు తాలిమినీయదె వెన్న భాస్కరా!"

అంటే గుణవంతుడు లేదా సజ్జనుడు ఇతరులు కీడు చేయుచున్నను వారికి ఎప్పుడూ మంచినే చేస్తాడు.ఎలాంటి సందర్భంలోనూ అపకారము తలపెట్టడు.అదెలా అంటే కవ్వముతో పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది కానీ కోపగించదు కదా అంటారు.
అలాంటి ఉత్తమ లక్షణాలను కలిగిన వారే సజ్జనులు. సాటి వారికి సాయం  చేయడం కోసం తాము కష్టాలను,నష్టాలను భరిస్తూ త్యాగం చేయడం సజ్జనుల లక్షణమని ఈ  "దగ్ధేంధన వహ్ని న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు