సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -116
నిర్ధన మనోరథ న్యాయము
******
నిర్థన అంటే ధనము లేని వాడు, నిరుపేద అని అర్థం.మనోరథం అంటే కోరిక. 
నిర్థన మనోరథం అంటే నిరుపేద కోరిక.
దరిద్రునికి అంటే నిరుపేదకు కోరిక లెక్కువ అనే అర్థంతో ఈ నిర్థన మనోరథ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. 
దరిద్రానికి కోరికలే కాదు ఆకలి కూడా ఎక్కువే, అంటారు. దాంతో పాటు మరో వాక్యాన్ని జోడించి చెప్పడం విశేషం. అదేనండీ "తద్దినానికి కూర లెక్కువ" అని.
అందుకేనేమో "దరిద్రునికి ఆకలెక్కువ - తద్దినానికి కూర లెక్కువ" అంటుంటారు.
తద్దినానికి... తత్ అంటే ఆ దినం, ఆరోజు . అది ఏ దినం,ఏ రోజు అంటే ఇంట్లో చనిపోయిన వ్యక్తిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే రోజును తద్దినం అంటారు.ఆరోజు మరణించిన వ్యక్తికి ఇష్టమైన రకరకాల కూరలను ,వంటకాలను చేసి అర్పిస్తారు. అందుకే తద్దినానికి కూరలెక్కువ అంటారు.
ఎవరికైనా  ఏ లోటూ లేకుండా మంచి బతుకు బతకాలనే కోరిక ఉండటం సహజం.
మనిషి పేద అయినంత మాత్రాన కోరికలు ఉండకూడదనే రూల్ ఏమీ లేదు కదా!
ఇంతెందుకు తినడానికి ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించదు. ఇంట్లో ఏమీ లేనప్పుడు అవి తింటే బాగుండు ఇవి తింటే బాగుండు అని రకరకాల కోరికలతో మనసు కొట్టుకులాడుతుంది కదండీ!
అన్నీ ఉండీ సమయానికి లేనప్పుడు కావాలని కోరిక కలిగినప్పుడు ఏం లేని వారికి ఇంకెన్నో కోరికలు ఉంటాయిగా.
అంతే కాదండోయ్!."దరిద్రానికి పిల్లలు ఎక్కువ" అని కూడా అంటారు.
ఒకప్పుడు ఎంత పేద వారైనా పిల్లల విషయంలో రాజీ పడేవారు కాదు.దేవుడిచ్చిన సంతానమని కంటూనే ఉండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు లెండి. కానీ పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం.ఉన్నవారింట్లో ఒక్కరో ఇద్దరో పిల్లలు. పేద వారింట్లో గంపెడు సంతానం. సంపాదించే వ్యక్తి మాత్రం ఒక్కడే.
ఇలా దరిద్రానికి లేదా నిరుపేదకు కోరికలు, ఆకలి, పిల్లలు అన్నీ ఎక్కువే.
మన పెద్దలు ఇలాంటివి సమాజంలో చూసి "ఇలాంటి న్యాయాలను, సామెతలను సృష్టించారు.ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పేందుకు వీటిని మన తరానికి అందించారు.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు