సుప్రభాత కవిత ; - బృంద
నీల నయనాలతో 
గగనం పలికే ప్రణయ
మౌనవచనాల విని
మురిసిపోయే భువి

ఉదయ సిందుర వర్ణాలు
మదిలో మందార పుష్పాలై 
విరిసే భావ వీచికలు
హృదయ రాగ విపంచులు

కలల వెలుగు కమ్మనైతే
ఊహల ఉధృతి ఉప్పెనలే!
కురిపించు తలపుల జడులే
మురిపించే మువ్వల సవ్వడులు

మదిలో మెదిలే పదాల
పరంపరలే పరవశం
భావసంపదే చిత్తంలో 
నిండిన విత్తపు పరిమళం

ప్రకృతి అణువణువూ
అపురూప సౌందర్యం
ఎద మోయలేని హాయినిచ్చే
కమనీయ కావ్యం

అంతరంగ ఆనందమే
తేటనీటి కొలను మాటున
దాచుకున్న అద్వితీయ
ఆనంద  జీవన మకరందం

ప్రకృతితో మమేకమయ్యే
అపురూప అనుభూతినిచ్చు
వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు