సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -97
దగ్ధ పట న్యాయము
  *****
దగ్ధ అంటే కాలిన.పటము అంటే వస్త్రము లేదా బట్ట.
 
మడత పెట్టిన వస్త్రం కాలిపోయినప్పటికీ మడతలు అలాగే మడతలుగానూ,పోగుల అల్లిక చెదరకుండా అలాగే కనబడుతుంది కానీ చేతుల్తో ముట్టుకున్న వెంటనే విడిపోతుంది.
వస్త్రం తగలబడి పోయిననూ దాని యొక్క ఆకారము చెదర గొట్టనంత వరకు చక్కగా కనబడుతుంది.
అలాగే మనకు కనబడుతున్న ఈ చరాచర జగత్తులో కొన్ని వాస్తవాలు కనిపించీ, కనిపించకుండా పోతూ సత్యాసత్య శాస్త్రీయతను తెలిసేలా చేస్తాయి.
ఇలా కనిపించిన యదార్థముతో మనలోని భ్రాంతి, సంశయమును దూరము చేయడాన్ని  దగ్ధ పట న్యాయముతో పోలుస్తూ ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే "దగ్ధ పత్ర న్యాయము "అని కూడా అంటారు.పత్రము అంటే ఆకు.ఆకు కాలిపోయినప్పటికీ దాని లోని ఈనెలతో సహా ఆకారము కనబడుతుంది.ఆ తర్వాత దానిని తాకితే మసిగా విడిపోయి ఆకారం కనబడదు.
బాగా ఎండ కాస్తున్న సమయంలో వాన జల్లు వచ్చినప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సు దృగ్గోచరము అవడం అందరికీ అనుభవమే.
ఈ ఇంద్రధనుస్సు అనేది దృష్టి విద్యా, వాతావరణ శాస్త్ర సంబంధమైన దృగ్విషయం.ఇందులో శాస్త్రీయత దాగి ఉందనేది కాదనలేని సత్యం.
అలాగే  శాస్త్రీయంగా చేసే కొన్ని ప్రయోగాలు కూడా అంతే. ప్రయోగానికి ముందు,ఆ తర్వాత చెందే మార్పులు మనలోని అనేక సందేహాలు,భ్రాంతులను దూరం చేసి సత్యాసత్యాలను శాస్త్ర విజ్ఞాన పరంగా తెలుసుకునేలా చేస్తాయి.
అలా ఈ జగత్తులో   అంతర్లీనంగా ఉన్న శాస్త్రీయతను తెలిసేలా చేసే న్యాయమునే ఈ "దగ్ధ పట న్యాయము" లేదా "దగ్ధ పత్ర న్యాయముగా" చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు