పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవిత 24గంటలు అనే చిత్రకవితల పోటీల్లో తిరుమలరావు పాల్గొని విజేతగా నిలిచారు. ఇరువురి వేర్వేరు భావాలు అనిపించేలా కరచాలనం చిత్రం ఇచ్చి ఒక్క రోజు లోగా కవిత పంపేలా నిర్వహించిన ఈ పోటీల్లో 225మంది పాల్గొనగా, అందులో టాప్ 25 లో నిలిచి ఉత్తమ కవి బిరుదాంకిత ప్రశంసాపత్రం అంతర్జాలం ద్వారా పొందారు. తిరుమలరావు పంపిన చిత్తశుద్ధి చెత్తబుద్ధి అనే కవిత విజేత స్థానాన్ని సొంతం చేసుకుంది. 169 రాష్ట్ర సదస్సులు జాతీయ కవి సమ్మేళనాలు ప్రపంచ మహాసభలను ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక, 36 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సాహిత్య సంస్థగా నిలిచింది. గత పదేళ్లుగా వివిధ ప్రత్యేక పర్వదినాల్లో ఆయా సందర్భాలననుసరించి కవితలు కథలు వ్యాసాలు వంటి సాహిత్య ప్రక్రియల పోటీలు నిర్వహిస్తూ వేలాది మందిని ప్రోత్సహిస్తున్న ఘనత శ్రీ శ్రీ కళా వేదిక సొంతం. తిరుమలరావు పంపిన రచనలో ఆశతో నీవు ఆశయంతో నేను అంటూ, లక్షల సంపాదనకే నీవు లక్ష్య సాధన దిశగా నేను అంటూ కుటిల మైత్రి తత్వాన్ని ఎండగడుతూ రచించారు. పని చేసేవాడు ఎంతైనా చెప్పగలడు పని చేయనివాడు చేసే వాడి చెడు గూర్చి చెప్పగలడు అంటూ తన కవిత ద్వారా అసూయ చెంది స్నేహం నటించేవారిని దుయ్యబట్టారు.
ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వం వహించగా, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో, జాతీయ కార్య నిర్వహణ అధికారి నూక సంపత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ చిత్ర కవిత పోటీలకు, సబ్బెళ్ళ మహాలక్ష్మి రెడ్డి, సువర్ణ జోషి, సాహూ సంథ్య, పి.సాయి సంతోషిలు సమన్వయకర్తలుగా వ్యవహరించి తిరుమలరావును అభినందించారు. న్యాయనిర్ణేతలుగా డా.టి.పార్థసారథి, డా.బాలచందర్ సాదే, నరసింహ శర్మ, చండ్ర వెంకటేశ్వరరావు, డా.కావూరి శ్రీనివాసశర్మ, పుల్లేటికుర్తి శ్రీనుబాబు, నల్ల భాగ్యలక్ష్మి వ్యవహరించి, చిత్తశుద్ధి చెత్తబుద్ధి అను కవితను అభినందిస్తూ తిరుమలరావును విజేతగా ఎంపిక చేస్తూ ఉత్తమ కవి బిరుదాంకిత ప్రశంసాపత్రాన్ని పంపారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఐన కుదమ తిరుమలరావు గానం, చిత్రలేఖనం, నటన, రచన, సేవారంగాలలో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ, నేడు జాతీయ స్థాయి కవితల్లో విజేతగా నిలుచుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి