సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -101
దశానామేకాదశ న్యాయము
******
దశ అంటే పది.ఏకాదశ అంటే పదకొండు.
దశానామేకాదశ అంటే పదిలో పదకొండు అన్నమాట.
పదిలో పదకొండేమిటీ? వస్తే పది తర్వాత కదా.పదిలో పదకొండు ఎలా వస్తుంది?.ఇది వంద మిలియన్ల ప్రశ్న అయినా మన వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు అనుకునే గుంభనమైన మాటిది.
 
పండుగలకు,పబ్బాలకూ, పెళ్ళిళ్ళు పేరంటాలకు ఆచారం, పద్ధతి, సంప్రదాయం, పరువూ మర్యాద ఇలా అనేక రకాలుగా అనుకుంటూ తనకు ఉన్నా లేకపోయినా "ఏదైనా కొంత డబ్బును (ధనము)  ఖర్చు  (వ్యయము) చేయవలసి వచ్చినప్పుడు, మరికొంత డబ్బును వెనుకాడకుండా ఖర్చు చేయడం.అలా తప్పని సరై ఖర్చు చేసే వాళ్ళు పైకి గంభీరంగా "అయితే అయింది ఏం చేస్తాం? "పదిట్లో పదకొండు" అనుకోవడమే" "దశానామేకాదశ న్యాయము.
 ఇలాంటి న్యాయాలను చదువుతున్నప్పుడు, సామ్యంగా ఉన్న సామెతలు,జాతీయాలను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే... మన వాళ్ళు బాధలను, కష్టాలను సమస్యలను చిరునవ్వుతో స్వీకరించి, ధైర్యంగా అధిగమిస్తారని.
 "ఇంట్లో బియ్యం నిండుకున్నాయి" అంటారు. సామాన్య అర్థంలో చూస్తే ఇంట్లోకి  బియ్యం వచ్చి చేరాయని.కానీ అర్థం అది కాదు "అయిపోయాయి అని". ఇలా ఇంట్లో ఏవైనా అయిపోతే వాటిని గురించి 'నిండుకున్నాయి' అని చెప్పడంలో వారి గుంభనత్వమే కాకుండా ఆర్థిక స్థితి కూడా ఇమిడి ఉంది.
ఈ కోవకు చెందినదే "పదిట్లో పదకొండు". ఇల్లు కట్టేటపప్పుడు ఇంత బడ్జెట్ లోనే కట్టుకోవాలని అన్ని ప్లాన్లు వేసుకుంటాం.  బంధువులో స్నేహితులో వచ్చి "ఇంత ఖర్చు పెట్టి కట్టుకుంటున్నావ్. కట్టబోయి మళ్ళీ కడతావా? ఫలానాది కూడా చేర్చితే బాగుంటుంది, ఇలా  చేస్తే బాగుంటుంది". అని సలహాలు సూచనలు ఇస్తుంటారు.
ఇంకేముంది... నిజమే కదా !"'పదిట్లో పదకొండు' అనుకుంటూ అదనపు ఖర్చుకు సిద్ధపడి పోవడం " చూస్తూ ఉంటాం.
అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇదే తంతు. మనసును గట్టి పరుచుకుని ' దేనికీ తగ్గేదేలే' అనుకుంటూ  ఖర్చు చేయడం చూస్తున్నాం.
ఈ మధ్యే వచ్చిన "బలగం"   సినిమా దీనికి చక్కని ఉదాహరణ. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, పరువూ మర్యాద కోసం డబ్బు ఖర్చు పెట్టి బంధువర్గాన్ని సంతృప్తి పరచడం చూసినప్పుడు ఈ న్యాయము గుర్తుకు రాకమానదు.
 కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనూ,మరికొన్ని తప్పించుకోగలిగినా ఏమోలే మళ్ళీ మళ్ళీ చేస్తామా? ఏమిటి? అనుకుంటూ  ఇలా ఖర్చు చేయడాన్నే "దశానామేకాదశ న్యాయము" అంటారు.
 ఆ తర్వాత జరిగేది ఏమిటో సరదాగా చెప్పి ముగిస్తాను."బొక్క కొరకంగా భోగం - లెక్క చూడంగా దుఃఖం" ఇలాంటివి చాలా మందికి అనుభవమే కదా!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు