సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -117
నివాతస్థ దీప న్యాయము
******
నివాతః అంటే,ప్రాపు, గాలి లేని చోటు.తస్థ అంటే ఉండునది, కదలనిది అని అర్థం.దీప అంటే దీపము, ప్రకాశము వెలుగు అనే అర్థాలు ఉన్నాయి.
నివాతస్థ దీప అంటే గాలి లేని చోట అచంచలముగా అనగా కదలకుండా ఉన్న దీపం అని అర్థం.
కదలని దీపం వలె  ఎవరు, ఏది ఉండాలి అనే  సంశయం అందరికీ వస్తుంది కదా అందుకే ఈ భగవద్గీత శ్లోకం చూద్దాం.
"యథా దీపో నివాత - స్థో నేగతే సోపమా స్మృతా/యోగినో యత- చిత్తస్య యుంజతో యోగమ్ ఆత్మనః//"
అర్థం ఏమిటంటే గాలి లేని ప్రదేశంలో దీపము కదలనట్లు, మనస్సును అదుపులో ఉంచుకునే అతీంద్రియుడు అంటే ఇంద్రియాలను అధిగమించిన వ్యక్తి అతీతమైన ధ్యానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు అనే అర్థంతో ఈ "నివాతస్థ దీప న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీపము ఎక్కడ కదలకుండా నిశ్చలంగా ఉంటుందంటే గాజు కుప్పెలోనో గాలి సోకని ప్రదేశంలోనే కదా!.అలాగే హృదయమనే గాజు కుప్పెలో ఉన్న మనసును అరిషడ్వర్గాల గాలులతో ఊగిసలాడనీయకుండా  ఉంచుకోవడమనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే వ్యక్తి ఇంద్రియ వ్యామోహాలలో చిక్కకుండా అచంచలమైన మనో నిగ్రహంతో జీవిస్తూ తనలోని జ్ఞానమనే వెలుగును తన చుట్టూ ఉన్న వారికి పంచుతూ ఉంటాడు, ఉండాలన్న మాట.
తెలుగులో" గాలిలో పెట్టిన దీపము" అనే సామెతతో పోలుస్తారు. గాలిలో పెట్టిన దీపానికి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయకపోతే దీపం ఆరిపోతుంది.కాబట్టి  గాలి తాకకుండా ఉండేందుకు మానవ ప్రయత్నం చేయాలి.
ఈ న్యాయానికి సంబంధించినది మహా భారతంలోని ఆది పర్వము అష్టమాశ్వాసంలో మందపాలుడి కథ ఉంది.
ఆ కథను రేఖా మాత్రంగా చూద్దాం.
కృష్ణార్జునుల సాయంతో అగ్ని ఖాండవ దహనం చేస్తున్న సమయం. మందపాలుడి భార్య జరిత అనే పక్షి. వారికి జరితారి,సరీసృక్కు,స్తంభమిత్రుడు,, ద్రోణుడు అనే రెక్కలు రాని పిల్లలు ఉన్నాయి.మందపాలుడు ఆ ప్రాంతం నుండి వేరే ప్రదేశానికి వెళుతూ అగ్ని దేవుని తన కుటుంబం ఉన్న చెట్టును, పిల్లలను దహించవద్దని ప్రార్థించి అభయం పొంది వెళతాడు. ఆ విషయం తెలియని అతడి భార్య  జరిత ఖాండవ దహనం సమయంలో బాగా దుఃఖిస్తూ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆరాటపడుతుంది. పెద్ద వాడైన జరితారి ధైర్యం చెప్పి తల్లిని పంపిస్తూ  తమ ప్రయత్నంతో  గాలి వాలు ద్వారా,తండ్రి పొందిన అభయం ద్వారా మంటల వేడి నుండి తప్పించుకోవడం జరుగుతుంది.ఇక్కడ ఆ పక్షి పిల్లల మనో నిగ్రహం, వారు చేసిన ప్రయత్నాన్ని "నివాతస్థ దీప న్యాయముతో పోల్చడం విశేషం.
ఇవండీ "నివాతస్థ దీప న్యాయము"నకు సరితూగే ఉదాహరణలు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు