సుప్రభాత కవిత ; -బృంద
కడలి లోతు కనుగొనగలమా!
మనసు అంతు తెలియగలమా!
జీవితచక్ర గమనంలో
తలచే వెన్నో??  గెలిచేదెన్నో?!

మారుమూల మమతలన్ని
మాటువేసి ఉంటాయి...
అపురూపంగా ఆల్చిప్పల పెట్టెల్లో
సముద్రగర్భాన  ఆణిముత్యాల్లా!

మనసనే కడలి అడుగున
నిక్షిప్తమై  ఉన్న  జ్ఞాపకాలు
ఏ కదలిక కు పైకొస్తాయో!
ఏ బీడును తడిపేస్తాయో?!

ఏ రాతిలో ఏ జీవం
ప్రాణం పోసుకుంటుందో
ఎంతకాలం ఎదుగుతుందో
రాతిలోని చెమ్మకే తెలుసు.

ఏ మదిని  ఏ మనసు కదిలిస్తుందో....
ఏ మమత  నారుపోసుకుంటుందో
ఏ బంధం ముడిపడుతుందో.
ఆ మమతకు మాత్రమే తెలుసు

ఏ రోజు  మనకోసం
కొత్తగా ఏ వైపు నుండీ
ఏం మోసుకొస్తోందో
ఏ మార్పు నిస్తుందో!

తెలియని తాయిలం  తెచ్చే
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు