గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత; -: సి.హెచ్.ప్రతాప్
 యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్‌ఫ్రైడేగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకుంటారు. చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. ప్రార్థనలో గడుపుతారు.గుడ్ ఫ్రైడే అని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏసుప్రభువు మానవజాతి మేలు కోసం ఇదే రోజున తన ప్రాణాలను త్యాగం చేశారని క్రైస్తవులు నమ్ముతారు. ఈరోజు మానవజాతి అన్ని పాపాలకు క్షమాపణను సూచిస్తుందని కూడా విశ్వసిస్తారు. లోక రక్షకుడిగా పేరొందిన ఏసుప్రభువు తన ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలను సైతం విడిచారని క్రైస్తవులు నమ్ముతారు. అందుకే ఆ రోజును హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.
శిలువలో యేసు క్రీస్తు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు, బాధ తీవ్రంగా ఉన్నా, శిలువను వీక్షిస్తున్న తల్లికోసం లేదా శిష్యులకోసం ప్రార్ధన చేయలేదు. అంతేకాదు శిలువలో ఆయన మరణంద్వారా భవిష్యత్తు ప్రణాళికలో నిర్మించబడే సంఘంకోసం ప్రార్ధన చేయలేదు. ఆ వేదనకు బదులుగా, శత్రువుల కొరకు ప్రార్ధించాడు. ఆయన హింసకు కారణమైన వాళ్ళు కఠినంగా శిక్షించాలని కాదు గాని వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు.
శత్రువుల కొరకు ప్రార్ధించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గూర్చి మనం నార్చుకోవాలి. ఈ ప్రేమ ఎటువంటి శత్రువులనైనా మిత్రులుగా మార్చేయగలదు. దోషులు ఉండవలసిన స్థానంలో వారికి బదులుగా ఏ తప్పు చేయని వ్యక్తి ఆ స్థానంలో శిక్ష పొందడం… ఇదే ఆ శిలువ గొప్పతనం. 

కామెంట్‌లు