శారదాదేవి దేవేంద్రనాధ్ ల పుత్రరత్నం
జన్మభూమిపై ఎనలేని ప్రేమాభిమానం
మానవ సంబంధాలపై అచంచల విశ్వాసం
సర్వమతాల సారమొకటని చాటిన శాంతి సుమం..
చిరు ప్రాయంలో సాహితీ సేద్యం
సంగీత చిత్రకళా రంగాల్లో విశేష ప్రావీణ్యం
బాల్యంలో మాతృభాషపై పెంచుకున్న మమకారం
అక్షరం ఆణిముత్యంగా మార్చిన కవిరత్నం..
కవన కిరణాలతో
అనంత జగత్తు జాగృత పరిచే ప్రభాత సూర్యుడు
ప్రకృతి ప్రేమికుడు
దేశానికి జాతీయ గీతం ప్రసాదించిన కవీశ్వరుడు
బాల మేధో వికాసానికి
శాంతినికేతన్ స్థాపించిన గురుదేవుడు..
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని
శ్రీనికేతన్ నెలకొల్పిన మహా మౌనముని
సామాజిక చైతన్యం ఉత్తమ సందేశంతో
విశేషమైన గుర్తింపు నిచ్చిన గోరా నవల..
ప్రపంచ సాహిత్యంలో గీతాంజలి
సకల సృష్టి పట్ల కలిగించే ప్రేమభావం
శ్రమశక్తి మహాత్యం చాటిన మహా కావ్యం
నోబెల్ పురస్కార మందుకున్న మణిమకుటం..
ఓ రచయిత ఓ చిత్రకారుడు సంగీత వేత్తగా
ఒక విద్యావేత్త గొప్ప మానవతా వాదిగా
విశ్వవిఖ్యాత సాహిత్య తేజమా!
నీ కీర్తి ఆచంద్రతారార్కం!
నీ అమోఘసేవ అజరామరం!!
(మే7, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా)


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి