వాన -- వారాల ఆనంద్ --9440501281
 నడిచి వెళ్తున్న నన్ను
చేతులు చాపి నిలువరించిన
వాన
తుంపర తుంపరగా
నా తల పైకెక్కి కురిసింది  
 
ఉరుములు మెరుపులు
వాన సహచరులు దాని వెంట లేవు
 
ఒక్క చిరుగాలి మాత్రం దయతో
వానకు తోడొచ్చింది
 
అంతా పరుగులు పెట్టి
సూర్లకిందికో చెట్ల నీడ కిందికో వెళ్ళి
తల దాచుకున్నారు
 
నేనేమో అట్లా నిలబడిపోయాను
 
టప టప మంటూ వేగం పెంచిన
వాన విసిరి విసిరి కొట్టింది
 
నా తలనూ కళ్లనూ
కాళ్లనూ చేతుల్నీ ముంచేసింది
వొంటిమీది బట్టలన్నీ
తడిసి ముద్దయ్యాయి
 
షర్టు జేబులోని కాగితాలతో పాటు
ఓ అసంపూర్ణ కవితా తడిసిపోయింది
 
“చల్లదనంతో వణుకు పుట్టడం లేదా?”
వాన నా చెవిలో గుస గుస లాడింది
 
పెదాలు కదిలి బదులివ్వకముందే
“కొత్త వూహలు ఉప్పొంగుతున్నాయి
సరికొత్త కవిత మొలకెత్తుతోంది”
అంది మనసు మూసి మూసిగా నవ్వుతూ
****** 

కామెంట్‌లు