సుప్రభాత కవిత -బృంద
మనసు రాసే మౌన కావ్యంలో
అనుభూతులే అక్షరాలు
అనుభవాలే అధ్యాయాలు
ఎద చెప్పే సొదలే ఎనలేని పుటలు.

మదిపొందే సరాగ విరాగాలు
మనసుపడ్డ కోరికలు
చేయిజారిన స్వప్నాలు
దారి మారిన గమనాలు

ఒడి నిండిన అమృతఫలాలు
సడి నిండిన మధురోహలు
జడిగా కురిసే తలపులు
ముడిపడ్డ మమతలు

అనుకోని అదృష్టాలు
తప్పిపోయిన  అవకాశాలు
అలరించిన అనురాగాలు
ఆస్వాదించిన అమృతక్షణాలు

అనుక్షణం వేధించే వేదనలు
అనుదినం అలుసైన సర్దుబాట్లు
అలుపెరుగని అంతరంగ మధనాలు
అర్థం తెలియని అపార్థాలు

పంటి బిగువున దాచిన బాధలు
పెదవి వంపున ఆగిన నవ్వులు
కంటి కొలకున పుట్టిన కొలనులు
ఎదను తడిపిన ఎరుగని బంధాలు

అన్నీ మనకే సొంతమైనవి
మనమే  సాధించుకున్నవి
మన జీవన కావ్యంలో
మనమే నాయకులం....

ప్రతిరోజొక కొత్త మలుపు
ప్రతి ఉదయమొక తీయని తలపు
జీవితంతోనే మన వలపు
సాధించుకోక తప్పని గెలుపు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు