సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -126
పంజర బక న్యాయము
*****
బకము అంటే కొంగ,వాలు కొంగ అని అంటారు..
పంజర బకము అంటే పంజరములో కొంగ అని అర్థం.
పంజర బక న్యాయము అంటే కొంగను పంజరములో పెట్టి ఎంతగా పెంచి పోషించినా అది చిలుకలా మాట్లాడదు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి  కొంగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కొంగ తెలుపు రంగులో ఉంటుంది.కొంగకు అద్భుతమైన కంటి చూపు ఉంది. చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు,కప్పల కోసం వెతుకుతూ ఒడ్డు తీరము వెంబడి నిశ్శబ్దంగా నడుస్తుంది.నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని తింటుంది. ఇవి గూళ్ళు కట్టుకోవడానికి ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకోవడం విశేషం.జనావాసాల్లో గూడు కట్టుకునే ముందు ప్రజలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుందట. కొన్ని కొంగల జాతులు ముఖ్యంగా సైబీరియన్ కొంగలు వలస కూడా వెళ్తూ ఉంటాయని మధ్య ఆసియా దేశమైన సైబీరియా నుండి దాదాపు ఐదు వేల మైళ్ళు ప్రయాణం చేసి తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి ప్రతి యేటా వస్తూ వుండటం చాలా గొప్ప విషయం, విశేషం కదా!
'సరిగమ పదనిస' అనేవి సప్త స్వరాలని తెలుసు కదా!'అందులో ప్రతి స్వరం   పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే.అందులో 'మ' అంటే మధ్యమం' కొంగ అరుపు  నుండి తీసుకోబడిందని చెబుతారు.
ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు.నేర్పితే  నేర్చుకోలేదు.
ఇక చిలుక లేదా రామ చిలుక  విషయానికి వస్తే... చిలుక ప్రత్యేకమైన రంగులతో ఆకర్షణీయంగా ఉండే పక్షి.
ఈ చిలుకలు చెట్టు తొర్రల్లో గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. ఇవి చాలా తెలివైన పక్షులు.మనుషుల గొంతును విని అదే విధంగా అనుకరిస్తూ మాట్లాడుతాయి.అందుకే కొంత మంది చిలుకలను తెచ్చుకుని పెంచుకుంటూ ఉంటారు. మరికొంతమంది చిలుకలను పంజరంలో బంధించి  'చిలుక జోస్యం' చెబుతాం అంటూ  పల్లె, పట్టణాల్లో తిరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాము.
కొంగకు, చిలుకకు గల తేడా తెలుసుకున్నాం కదా!
మరి అలాంటి కొంగను పంజరంలో బంధించి మాటలు నేర్పితే వస్తాయా!రావు అవి రెండూ పక్షి జాతికి చెందినా.దాని స్వభావము  వేరు కదా!
అందుకని కొంగకు ఎంత నేర్పినా చిలుకలా పలుకలేదు.
 ఈ న్యాయానికి దగ్గరగా  వేమన  ఓ పద్యాన్ని రాశారు.
'ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన/నలుపు నలుపే గాని తెలుపు గాదు/ కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకునా/ విశ్వధాభిరామ వినురవేమ!
అంటే ఎలుక తోలును ఎంతగా ఉతికినా దాని సహజ రంగు నలుపు పోదు. అలాగే చెక్క బొమ్మను ఎంత కొట్టినా అది పలుకదు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే స్వభావ సిద్ధంగా వచ్చిన గుణాలు మారవు. మనమెంత ప్రయత్నించినా అది నిష్ఫలం,వ్యర్థమే అని అర్థం.
అలాంటి అర్థంతోనే ఎంత ప్రయత్నించినా మారని స్వభావంగల వ్యక్తులను,అలవి కాని వాటిని చేసి చూపాలనే ప్రయత్నం,వృధా ప్రయాస అని చెప్పడానికి ఈ "పంజర బక న్యాయమును' తరచుగా అన్వయించి చెబుతూ ఉంటారు. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు