సనాతన ధర్మం;- సి.హెచ్.ప్రతాప్
 ప్రతి జీవి యొక్క స్వరూపం గురించి భగవంతుడు జీవుని యొక్క స్వరూపం లేదా రాజ్యాంగ స్థానం, భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తికి సేవ చేయడం అని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి.
"ధార్యతే ఇతి ధర్మః" అన్న శాస్త్ర వాక్యం ప్రకారం  పారమార్ధిక దృష్టితో చూస్తే అందరినీ ధరించి పాలించు విశేషస్వరూపమునే ధర్మం అని, వ్యవహార దృష్టితో చూస్తే పాటించే మనిషికి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టే అలవాట్లనూ ఆ అలవాట్లు మనస్తత్వంలో స్థిరపడేటందుకు అవసరమైన ఆలోచనా పద్ధతిని శాసించే నియమాలని కలిపి ధర్మం అనీ అంటారు.ఈ ధర్మం అనే ఒక్క మాటని పుట్టించి నిర్వచించి విశ్లేషించి నిరూపించి మానవ జీవితానికి కేంద్రస్థానంలో నిలబెట్టటమే సనాతన ధర్మం యొక్క విశిష్టత!
 సత్యవాక్పరిపాలన, పరోపకారము, భూతదయ, బ్రహ్మచర్యం/ ఇంద్రియనిగ్రహం, దానశీలత, ఆహారశుద్ధి, విద్యుక్త కర్మాచరణం, శాంతస్వభావం, క్షమాగుణం అనే లక్షణాలను ప్రతి ఒక్కరికీ ఆవసరమైన లక్షణాలని పేర్కొన్నారు. అట్లాగే లోభం, క్రోధం, మోహం వంటి అధర్మ సంస్కారాల్ని యొక్క దుష్ప్రభావాలను వివరించి ఆ దుష్టత్వాలకు అలవాటు పడటం వల్ల కలిగే నష్టాన్ని చెప్పి వాటిని వదిలివెయ్యడానికి సులువైన మార్గాలను కూడా సూచించారు.
సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు. సృష్టి స్థితి లయ విభూతు లన్నింటా ఇమిడిపోయి వాటిని నడిపిస్తూ ఉంటుంది. ప్రళయంలో సైతం నశించదు - బీజ రూపంలో నిద్రాణమై ఉండి సృష్టి మొదలైనప్పుడు చైతన్యవంతమై సకల భూతాలకీ రక్షణ నిచ్చే మనోగతమైన సంస్కారాల్నీ  క్రమబద్ధమైన జీవన విధానాల్నీ ప్రసాధించి శాసించేది సనాతన ధర్మమే!త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని పాటించేవారికి మరణానంతరం లభించే స్వర్గసుఖాల కన్న వెయ్యి రెట్లు అధికమైన ఆనందానుభూతి జీవిత కాలంలోనే అనుభవంలోకి వచ్చి మరణానంతరం జన్మలు లేని కైవల్యం సిద్ధిస్తుంది. 

కామెంట్‌లు