సుప్రభాత కవిత ; - బృంద
దిగులు పడ్డ రాతిరికి
కలలు పండి
కలత తీరే కానుకలా

కదలి సాగే ఏటినీరు
వెనుకకు  తిరిగి
ఆగిచూసే అబ్బురమవగా

కుదురులేని పాలమబ్బులు
కుంకుమ వన్నెల 
ముస్తాబు చేసుకోగా

చెదరక నిలిచిన అచలములన్నీ
చేతులు జోడించి చేసే
సంధ్యా వందనమవగా

చకచకసాగే కొండగాలుల
పలకరించే పచ్చనాకులు
సన్నగ ఊగే తోరణమవగా

తీరంలోని గరిక మొక్కలు
తూరుపు ఎరుపును చూసి 
చిందులు వేస్తుండగా

కనక కాంతుల వెలిగే
సువర్ణపుష్పం ...
వేయిరేకులు విరిసి రాగా

అవని అణువణువూ
ఆనంద తరంగాల
ఊయలూగుతూ స్వాగతించు

వెలుతురు వెల్ల వేసిన వాకిట
వెలుగుల ముగ్గులేసే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు