ఓ కాకి నీతి కథ...; - బల్ల కృష్ణ వేణి-పలాస-శ్రీకాకుళం జిల్లా
 ఒక స్వామీజీ అడవిలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు మీద కాకి కూర్చుని బాగా ఏడుస్తుంది. అప్పుడు స్వామీజీ ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కాకి ఏడవక ఇంకేమి చేయమంటావు స్వామీజీ. నేనెవరింటికైనా వెళ్ళినప్పుడు నల్లగా ఉన్నానని అందరూ వెళ్లగొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు అని ఏడ్చుకుంటూ చెప్పింది కాకి. నువ్వు నల్లగా ఉన్నావని బాధపడుతున్నావా, సరే నీకు ఎలాంటి రంగు కావాలో కోరుకో నిన్ను అలా మార్చేస్తాను, అప్పుడు ఆ కాకి స్వామీజీ! నేను హంసలాగా బ్రతకాలనుకుంటున్నాను. సరే నిన్ను హంసలాగా మార్చేస్తాను గాని, ఒక షరత్. ఒకసారి వెళ్లి హంసను కలిసి రా అని చెప్పాడు స్వామీజీ, కాకి హంస దగ్గరకు వెళ్లి హంస గారు! ఏమి అందమండి మీది, చూడడానికి ఎంత బాగున్నారో, ఈ లోకంలో నీ కన్నా మించిన తేజస్సు, రంగు ఇంకొకరికి లేవు అని పొగిడింది. ఓ కాకి మిత్రమా! నువ్వు అనుకున్నవన్నీ నిజమే, ఎందుకంటే నువ్వు నా పైనున్న రంగుని, రూపాన్ని చూసావే కానీ నా మనసులో ఉన్న భయాన్ని చూడలేదు అని పలికింది హంస. అదేంటి నీకెందుకు భయం అందరూ నిన్ను ఇష్టపడతారు గా అన్నది కాకి. అవును మిత్రమా! జనాలు ఫోటోలు దిగడానికి వస్తున్నారో , వేటగాడు రూపంలో వస్తున్నారో తెలియక ప్రతిక్షణం బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నాను అని చెప్పింది హంస. కాకి మరి నువ్వు నేను కాకుండా ఎవరు బాగుంటారు ఈ లోకంలో ....!!!ఈ లోకంలో రామచిలుక బాగుంటుంది. దానిని ఇంట్లో పెట్టుకుని మంచి ఆహారం పెట్టి పెంచుతారు మనుషులంతా. అప్పుడు కాకి సరే మనం స్వామీజీ దగ్గరకు వెళ్లి రామచిలుక లాగా మార్చుకుందాం రా! ఆ రెండు స్వామీజీ దగ్గరకు వెళ్లి మమ్మల్ని రామచిలుకగా మార్చేయండి. సరే, నాది ఒక షరత్ మీరిద్దరూ రామచిలుకను కలిసి రండి అని చెప్పాడు స్వామీజీ. అప్పుడు ఆ రెండు సరే అని రామచిలుక దగ్గరకు వెళ్లారు కాకి హంస చెట్టు అంతా వెతికాయి కానీ చిలుక ఎక్కడ కనబడలేదు. వెళ్ళిపోదాం అనుకునేసరికి రామచిలుక గొంతు వినిపించింది, అప్పుడు ఆ రెండు చిలుకను చూసి చిలుక మిత్రమా! నీ రంగు నీ ఆకారం చాలా అందంగా ఉంది, నీలాంటి అందం ఇంకొకరికి ఉండదు అందుకే నిన్ను మనుషులంతా తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. నీ అంత అదృష్టం ఇంకెవరికి ఉండదు అని కాకి హంస పొగిడాయి. మిత్రులారా! నా కష్టం నీకేమి తెలుసు నన్ను మనుషులంతా పంజరంలో బందీ చేస్తారు. నాకు స్వేచ్ఛ లేదు ఇంకా నా రంగు అంటారా చెట్లు రంగు నాది ఒకటే రంగు నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు, మీరు కూడా నన్ను ఎంతసేపు వెతికారు కదా అని బాధపడుతూ చెప్పింది రామచిలుక. మనందరి కంటే నెమలి చాలా అందమైనది. నాట్యం బాగా చేస్తుంది. నెమలి జాతీయ పక్షి. జనులంతా నెమలిని ఎంతగానో పొగుడుతారు. అని చెప్పింది రామచిలుక. అది విన్న కాకి హంస చిలుక మిత్రమా! మనం స్వామీజీ దగ్గరకు వెళ్లి నెమలి వలే మారిపోదాము. అనుకుని స్వామీజీ దగ్గరకు వెళ్లాయి. స్వామీజీ! మా అందరి కంటే గొప్ప పక్షి నెమలి. చాలా అందమైన పక్షి, మమ్మల్ని నెమలి పక్షి లాగా మార్చండి అని ప్రాదేయపడతాయి స్వామీజీ దగ్గర. అప్పుడు స్వామీజీ సరే పక్షుల్లారా! మీకు ఒక షరతు మీరంతా నెమలిని కలుసుకొని రండి అన్నారు స్వామీజీ, అన్ని పక్షులు నెమలి దగ్గరకు వెళ్లాయి, కాకి , హంస, రామచిలుక ఇలా అంటున్నాయి. నెమలి మిత్రమా! నీ సోయగం, నీ అందం, నీ నాట్యం దగ్గర మేమంతా బలాదూర్ అని పొగడ్తలతో ముంచేసాయి. అప్పుడు నెమలి మిత్రులారా! నా బాధలు నాకు ఉన్నాయి. జనాలంతా నాట్యాన్ని, అందాన్ని చూడడానికి వస్తారు అందులో వేటగాడు ఎవరో తెలియక నేను కూడా బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నాను అని విన్నపిస్తుంది. అప్పుడు కాకి, నెమలి మిత్రమా! మరి నీకంటే అదృష్టం కలవారు ఈ లోకంలో ఎవరున్నారు అని అంటుంది. అప్పుడు నెమలి ఆ అదృష్టవంతురాలు నీవే కాకి మిత్రమా, ఎందుకంటే నిన్ను ఎవరు బంధించరు, వేటాడరు, నువ్వు ని ఆహారం ఎంతైనా స్వేచ్ఛగా తెచ్చుకుని తినగలవు నీకు ఈ లోకంలో తిరుగేలేదు. అప్పుడు కాకి తన తప్పును తెలుసుకొని వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు, ఈ పక్షులన్నీ రంగులలో, ఆకారాలలో గొప్పగా ఉన్నా చాలా భయంతో బ్రతుకుతున్నాయి. నిజమే నేనే వీలందరి కంటే అదృష్టవంతుడును అనుకుంది కాకి. వెంటనే స్వామీజీ దగ్గరకు వెళ్లి స్వామీజీ! నన్ను నాలాగే ఉండని అని ప్రార్థించింది. నన్ను క్షమించండి స్వామీజీ, ఇతరులతో పోల్చుకోవడం చాలా తప్పు అని తెలుసుకున్నాను. భగవంతుడు మనకు ఇచ్చిన వరం ఏమిటంటే మన బ్రతుకు మనం నీతిగా బ్రతకాలి. ఇతరులకు సహాయపడాలి అంతేగాని, ఇతరులతో ఎప్పుడు మనం పోల్చుకోకూడదు...
                                 

కామెంట్‌లు